తిరువనంతపురం: కేరళ వరద బాధితులకు  చేపలు విక్రయిస్తూ  చదువుకొంటున్నకేరళ విద్యార్థిని  హనన్ హమీద్  రూ.1.5 లక్షలను విరాళంగా ఇచ్చింది.  తన చదువుకోసం  వచ్చిన విరాళాలను  వరద బాధితులకు ఇస్తున్నట్టు ప్రకటించింది.

కాలేజీ యూనిఫామ్‌లో చేపలు విక్రయిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైన కేరళ విద్యార్థిని హనన్ హమీద్ కు వందలాది మంది  పలు రకాలుగా సహాయం చేశారు. త్రిస్సూరుకు చెందిన హనన్ హమీద్ బీఎస్సీ చదువుతోంది.  కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా  కాలేజీ పూర్తైన తర్వాత చేపలను విక్రయిస్తోంది. పబ్లిసిటగీ కోసమేనంటూ హనన్ హమీద్‌ను ట్రోలింగ్ చేశారు. 

ఆ సమయంలో హమీద్ కు కేరళ సీఎం విజయన్‌ సహా పలువురు అండగా నిలిచారు. ట్రోలింగ్ జరిగిన రెండో రోజు నుండే  ఆమెకు సహాయంగా పలువురు ఆమె అక్కౌంట్లోకి డబ్బులు వేశారు. ప్రస్తుతం రూ.1.5 లక్షలు ఆమె ఖాతాలోకి వచ్చాయి. 

కేరళలో వరదల కారణంగా  లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో హనన్ హమీద్ తనకు విరాళంగా వచ్చిన రూ.1.5 లక్షలను  వరద బాధితులకు ఇస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ప్రజల నుంచి నాకు అందిన విరాళాలను తిరిగి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు వారంతా కష్టాల్లో ఉన్నారు. నేను వారికి చేయగలిగిన కనీసం సాయం ఇది.. అని హనన్ ప్రకటించారు.