తిరువనంతపురం:కేరళ సీఎం  పినరయి విజయన్ కూతురు వీణ డీవైఎఫ్ఐ అధ్యక్షుడిని పెళ్లి చేసుకోనుంది. అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుంది.

కేరళ సీఎం పినరయి విజయన్  పెద్ద కూతురు వీణకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో స్వంతంగా స్టార్టప్ కంపెనీ ఉంది. ఈ కంపెనీకి ఆమె డైరెక్టర్ గా ఉన్నారు. 

కోజికోడ్ కు చెందిన రియాజ్ డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు. రియాజ్ సీపీఐఎం  కేరళ రాష్ట్ర కమిటి సభ్యుడిగా కూడ ఉన్నారు. ఈ నెల 15వ తేదీన వీణ, రియాజ్‌ల వివాహం జరగనుంది.

చాలా నిరాడంబరంగా ఈ పెళ్లి వేడుక నిర్వహించనున్నారు. వీణతో పాటు, రియాజ్ కు ఇది రెండో పెళ్లి. మొదటి భర్త ద్వారా వీణకు ఒక కొడుకు ఉన్నాడు. రియాజ్ కు కూడ గతంలో పెళ్లైంది. మొదటి భార్య ద్వారా ఆయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.

రియాజ్ వృత్తిరీత్యా న్యాయవాది. ఎస్ఎఫ్ఐ ద్వారా ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కోజికొడ్ ఎంపీ స్థానం నుండి రియాజ్ పోటీ చేశాడు. కాంగ్రెస్ అభ్యర్ధి ఎంకే రాఘవన్ చేతిలో స్వల్ప ఓట్లతో ఆయన ఓటమి పాలయ్యాడు.తిరువనంతపురంలో ఈ పెళ్లి వేడుకలు జరగనున్నాయి. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగానే ఈ పెళ్లి వేడుకలను నిర్వహించనున్నారు.

కాలికట్ యూనివర్శిటీ మాజీ మెంబర్  2002లో డాక్టర్ సమీహా సైతల్వీని రియాజ్ పెళ్లి చేసుకొన్నాడు. 2015లో వీరిద్దరూ విడిపోయారు. ఈ దంపతులకు 10, 13 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు.

ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త రవి పిళ్లై యాజమాన్యంలోని ఆర్టీ టెక్నో సాఫ్ట్ వేర్ సంస్థకు ఆమె సీఈఓగా ఉన్నారు. అంతకుముందు ఆమె ఒరాకిల్ సంస్థలో ఆరేళ్ల పాటు పనిచేసింది.వీణ కూడ తన మొదటి భర్తకు ఐదేళ్ల క్రితమే విడిపోయింది. రియాజ్, వీణలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇది వారి వ్యక్తిగత విషయమని డీవైఎఫ్ఐ నేతలు చెప్పారు.