కేరళ సీఎం పినరయి విజయన్ తాను ధోతిలో ఉన్న మోడీ అని నిరూపించుకున్నారని ప్రతిపక్ష నేత సతీశన్ విమర్శలు చేశారు. ప్రధాని మోడీ బీబీసీ కార్యాలయాల్లో దాడులు నిర్వహించగా.. ఈ సీఎం ఏషియానెట్ న్యూస్ మీడియా ఆఫీసులపై దాడులు చేస్తున్నారని అన్నారు.
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీడీ సతీశన్ సీఎం పినరయి విజయన్ పై విమర్శలు సంధించారు. మలయాళ ప్రధాన మీడియా సంస్థల్లో ఒకటైన ఏషియానెట్ న్యూస్ మీడియా ఆఫీసులపై సీపీఎం స్టూడెంట్ వింగ్ ఎస్ఎఫ్ఐ కార్యకర్తల దాడి, అనంతరం, పోలీసుల సెర్చ్ చూస్తుంటే కేరళ సీఎం పినరయి విజయన్ తాను ధోతిలో ఉన్న మోడీని అని నిరూపించుకున్నట్టే ఉన్నదని విమర్శలు చేశారు.
‘కేరళ సీఎం తాను ధోతిలో ఉన్న మోడీని అని నిరూపించుకుంటున్నాడు. బీబీసీ ఆఫీసుల్లో ప్రధాని మోడీ ప్రభుత్వం చేసిందే.. షియనెట్ న్యూస్ చానెల్ ఆఫీసుపై సీఎం పినరయి విజయన్ చేస్తున్నాడు. ఇది అసమ్మతిని అంగీకరించేదే లేదనే సంకేతాలను ఇస్తున్నది. అటు పీఎం, ఇటు సీఎం ఇద్దరూ విమర్శకుల గొంతు నొక్కాలనే ప్రయత్నిస్తున్నారు’ అని సతీశ్ అన్నారు.
నవంబర్ 10న ఏషియానెట్ నార్కోటిక్స్ ఒక డర్టీ బిజినెస్ అనే టైటిల్ పేరిట మాదక ద్రవ్యాలపై అవగాహన, అందుకు వ్యతిరేకంగా ఒక రిపోర్ట్ ప్రచురించింది. ఇది నకిలీ రిపోర్ట్ అని ఎమ్మెల్యే పీవీ అన్వర్ ఫిర్యాదు చేశారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు దాడి చేసిన తర్వాతే ఈ ఫిర్యాదు పోలీసులకు చేరుతుంది. ఫిర్యాదు అందిన 24 గంటల్లోపే పోలీసులు చర్యలు తీసుకున్నారు. పోక్సో సహా ఇతర ఐపీసీ సెక్షన్‌లలో కేసు నమోదు చేశారు.
Also Read: సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు.. హోంశాఖ ఒత్తిళ్లతోనే ఏషియానెట్ న్యూస్ ఆఫీసులో సోదాలు
ఇదిలా ఉండగా ఎషియానెట్ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సింధు సూర్యకుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తమ చానెల్ నిర్భయంగా, నిక్కచ్చిగా, ఎలాంటి ఒత్తిళ్లకు గురవ్వకుండా పని చేస్తుందని, వార్తలు అందిస్తుందని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం ఏషియనెట్ న్యూస్ విచారణకు సహకరిస్తుందని వివరించారు.
ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. 'నార్కోటిక్స్ ఈజ్ ఎ డర్టీ బిజినెస్' సిరీస్ లో భాగంగా 2022 నవంబర్ 10న ప్రసారమైన ఏషియానెట్ న్యూస్ కార్యక్రమానికి సంబంధించి అన్వర్ ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో 14 ఏళ్ల బాలిక ఇంటర్వ్యూ ఫేక్ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్వర్ పోక్సో కేసును ఆరోపిస్తున్నప్పటికీ, చిన్నారి బాధితురాలికి గానీ, కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి ఫిర్యాదు లేదని, ఆ వార్తాకథనానికి తాము కట్టుబడి ఉన్నామని నగర పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఫిర్యాదుదారు పీవీ అన్వర్ వాంగ్మూలం తీసుకోలేదనీ, ప్రాథమిక పరీక్ష కూడా నిర్వహించలేదని అధికారులు కమిషనర్ కు తెలిపారు. ప్రాథమిక చర్యలు కూడా తీసుకోకుండా మీడియా సంస్థ కార్యాలయంలోకి ఎలా ప్రవేశిస్తారని కోజికోడ్ పోలీసుపై అధికారులు ఇతర అధికారులను ప్రశ్నించారు. అయితే వీలైనంత త్వరగా ఏషియానెట్ న్యూస్ కార్యాలయాన్ని తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
