శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించిన ఘటనపై కేరళ భగ్గుమంటోంది. ముఖ్యంగా ప్రభుత్వమే మహిళలను దగ్గరుండి అయ్యప్ప దర్శనం చేయించడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

దీనిని నిరసిస్తూ శబరిమల కర్మ సమితితో పాటు పలు హిందూ సంస్థలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయం 7 గంటల నుంచే ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్సులు అడ్డుకున్నారు.

మరోవైపు పందలంలోని సీపీఎం కార్యాలయంపై పలువురు నిరసనకారులు రాళ్లదాడికి పాల్పడ్డారు. బస్సులపై దాడి చేయడంతో 60కి పైగా బస్సులు ధ్వంసమయ్యాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

మరోవైపు ముఖ్యమంత్రి పినరయి విజయన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పోలీసులు మోహరించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేరళకు వెళ్లే బస్సు సర్వీసులను కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు నిలిపివేశాయి.