ఆయన ఓ ఆటో డ్రైవర్ కానీ, రోడ్డ ప్రమాద సమయాల్లో ఆయనే ఆపదరక్షకుడు. తనకు సమాచారం అందగానే ఆటో తీసుకుని స్పాట్‌కు వెళ్లిపోతాడు. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తన ఆటోలో తీసుకెళ్తాడు. ఉచితంగానే బాధితులకు సహకరించి అందరి మన్ననలు పొందుతున్నారు. 

తిరువనంతపురం: కొన్ని ఘటనలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. మరికొన్ని ఘటనలు మన ఆలోచనలపై తీవ్ర ప్రభావం వేస్తుంటాయి. ఇంకొన్ని మన జీవితాలనే మార్చేస్తుంటాయి. కేరళ పాలక్కడ్‌కు చెందిన గోపాలకృష్ణన్ తన జీవితంలో ఎదుర్కొన్న ఓ దుర్ఘటనతో ఆదర్శనీయమైన నిర్ణయం తీసుకున్నాడు. సాధారణ ఆటో డ్రైవర్‌గానే సమాజానికి అసాధారణ సేవలు అందిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులను తన ఆటోలో ఉచితంగా హాస్పిటల్‌కు తీసుకెళ్తూ ఆపదరక్షకుడిగా అవతారమెత్తాడు. సమయం ఏదైనా.. సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు. ఒక్క కాల్ చేస్తే కళ్ల ముందు నిలుస్తాడు. అందుకే ఆయన అంటే పాలక్కాడ్ కుల్లప్పుల్లీ ప్రాంతం ప్రజలకు ఎంతో అభిమానం. గోపీ లక్కిడీ అన్న అని ఆయనను ముద్దుగా పిలుచుకుంటారు. ఒక్కసారి ఆయన సేవలు పొందిన వారు జీవితకాలం గుర్తుంచుకుంటామని చెబుతున్నారు.

2009లో తనకు ఎదురైన ఈ ప్రమాదమే తనను ఇలా మార్చిందని గోపాలకృష్ణన్ చెబుతారు. 2009లో పాలక్కాడ్ బస్ స్టేషన్ సమీపంలో ఓ కారు ప్రమాదానికి తాను గురయ్యానని గోపాలకృష్ణన్ వివరించారు. గాయాలతో తాను రోడ్డుపైనే ఉన్నప్పటికీ, సహాయం అర్థిస్తున్నా ఎవరూ సహకరించలేదని ఆయన తెలిపారు. సుమారు 20 నిమిషాలు అలాగే రోడ్డుపైనే నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. చివరకు సురేష్ అనే ఓ వ్యక్తి సహకరించాడని, ఆయనే తనను హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స చేయించాడని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి తనలాంటి పరిస్థితిని ఇంకెవరూ ఎదుర్కోవద్దనే నిశ్చయానికి తాను వచ్చానని చెప్పారు. తక్షణమే తన మెకానిక్ జీవితానికి స్వస్తి పలికానని వివరించారు.

తన బైక్ అమ్మేసి ఓ ఆటో కొనుగోలు చేశానని గోపాలకృష్ణన్ వివరించారు. అప్పటి నుంచి రోడ్డు ప్రమాదానికి గురైన వారిని ఉచితంగా తన ఆటోలో హాస్పిటల్ తీసుకెళ్లుతున్నట్టు తెలిపారు. ఆయన స్వయంగా హాస్పిటల్ తీసుకెళ్లడమే కాదు.. అవసరం అయినప్పుడు అంబులెన్సులతోనూ ఆయన సమన్వయంలో ఉంటానని వివరించారు. కరోనా సమయంలో గోపాలకృష్ణన్ సహాయం మరువలేనిది. వందలాది మంది కరోనా పేషెంట్లను తన ఆటోలో హాస్పిటల్ తరలించారు. ఆ సంక్షుభిత సమయంలో తాను నామినల్‌గా చార్జీ వసూలు చేసినట్టు వివరించారు.

కొన్నిసార్లు రాత్రుల్లోనూ ఫోన్లు వస్తుంటాయని, పోలీసులు కూడా ఒక్కోసారి సహాయం కోసం ఫోన్లు చేస్తుంటారని, ఏ సమయమైనా సరే తాను సత్వరమే స్పాట్‌కు వెళ్లిపోతానని గోపాలకృష్ణన్ తెలిపారు. ఆయన సేవలను ప్రభుత్వం కూడా గుర్తించింది. ఆయనను క్విక్ రెస్పాన్స్ టీమ్‌లోకి తీసుకుంది.