Asianet News TeluguAsianet News Telugu

శబరిమల తీర్పుకి మద్దతు పలికిన స్వామీజీ... ఆశ్రమానికి నిప్పు

సందీపానంద గిరి ఆశ్రమంపై దాడి చేసిన దుండగులు రెండు కార్లు, ఓ ద్విచక్రవాహనానికి నిప్పు పెట్టారు. 

Kerala Ashram Run By Preacher Who Backed Sabarimala Verdict Attacked
Author
Hyderabad, First Published Oct 27, 2018, 12:28 PM IST


శబరిమల ఆలయంలోని మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ.. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకి ఓ స్వామిజీ మద్దతు పలికారు. అంతే.. ఆ స్వామిజీ ఆశ్రమంపై ఆందోళన కారులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన తిరువనంతపురం లోని కుదంమాన్ కడవులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కుందమాన్‌కడవులోని స్వామి సందీపానంద గిరి ఆశ్రమంపై దాడి చేసిన దుండగులు రెండు కార్లు, ఓ ద్విచక్రవాహనానికి నిప్పు పెట్టారు. శనివారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

స్వామి సందీపానంద గిరి ఆశ్రమంపై దాడి ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. స్వామిజీ చర్యలను వ్యతిరేకించిన వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని విజయన్‌ అన్నారు. అయితే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ప్రభుత్వం ఎంతమాత్రం అంగీకరించబోదని సీఎం స్పష్టం చేశారు.

కేరళలోని పవిత్ర శబరిమల ఆలయంలోకి 10-50 మధ్య వయసు గల మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పునకు స్వామి సందీపానంద గిరి మద్దతిచ్చారు. దీంతో గతంలో ఆయనకు బెదిరింపులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

కాగా.. సుప్రీం తీర్పుతో కేరళలో గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇటీవల మాసపూజల నిమిత్తం శబరిమల ఆలయాన్ని తెరిచారు. ఈ సమయంలో కొందరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios