నేరస్థులకు అంత ధైర్యం ఎలా వచ్చింది? : ఢిల్లీ యాసిడ్ దాడిపై అరవింద్ కేజ్రీవాల్ ఫైర్
దేశ రాజధానిలో 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలను అస్సలు సహించమనీ.. నేరస్థులకు అంత ధైర్యం ఎలా వచ్చింది? ఢిల్లీలోని ప్రతి ఆడబిడ్డ భద్రత మాకు ముఖ్యమని అన్నారు..

దేశరాజధాని ఢిల్లీలో ఓ మైనర్ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. బుధవారం (డిసెంబర్ 14) ఉదయం 9 గంటల ప్రాంతంలో నైరుతీ ఢిల్లీలోని ద్వారకా మెట్రో స్టేషన్ వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న బాలిక తన సోదరితో కలిసి వెళ్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు బాలిక ముఖంపై యాసిడ్ పోశారు. దీంతో బాలిక తల్లాడిల్లింది. ఈ దారుణాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే బాధిత విద్యార్థిని సఫ్దర్‌గంజ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతోంది. ఆమె ముఖం, కళ్లకు 8 శాతం మేర యాసిడ్ వల్ల కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నేరగాళ్లకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందని అన్నారు. ఇలాంటి చర్యలను అస్సలు సహించేది లేదని అన్నారు.
సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ ఇలా రాశారు. నేరస్థులకు అంత ధైర్యం ఎలా వచ్చింది? నేరస్తులను కఠినంగా శిక్షించాలి. ఢిల్లీలోని ప్రతి ఆడబిడ్డ భద్రత మాకు ముఖ్యం. అని పేర్కొంటూ.. సీసీటీవీ పుటేజీను కూడా పంచుకున్నారు. ఫుటేజీలో.. మైనర్ విద్యార్థి రోడ్డుపక్కన నిలబడి ఉండగా బైక్ మీద వచ్చిన యాసిడ్ పోయడం చూడవచ్చు.
ఈ సంఘటన తర్వాత.. బాధితురాలు ఇద్దరు అబ్బాయిలపై అనుమానం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు చర్య తీసుకొని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ద్వారక) హర్ష వర్ధన్ మండవ తెలిపారు. దాడి జరిగినప్పుడు బాధితురాలు తన చెల్లెలితో కలిసి ఉందనీ, అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, దాడికి గల కారణాలను వెలికితీసేందుకు అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
మరోవైపు.. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) స్పందించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.ఈ ఘటనపై శుక్రవారం (డిసెంబర్ 16)లోగా వివరణ ఇవ్వాలని కమిషన్( DCW) కోరింది. అంతేకాకుండా.. ఢిల్లీలో యాసిడ్ విక్రయం కొనసాగడంపై డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ అధికారులపై మండిపడ్డారు.దేశంలో యాసిడ్‌ను కూరగాయల వలె సులభంగా విక్రయిస్తున్నారని ఆరోపించారు. యాసిడ్ విక్రయాలను ఆపకపోతే.. కోర్టును ఆశ్రయిస్తామని కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ వీడియోలో తెలిపారు.