Chandigarh: చండీగఢ్‌ను రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం తీర్మానం చేయడంపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ లు వెంటనే హర్యానా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
AAP government: పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయ దుమారం రేపుతోంది. పంజాబ్, హర్యానా నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఆప్ ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహించిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చండీగఢ్ అంశం దీనికి ప్రధాన కారణం అయింది. వివరాల్లోకెళ్తే.. చండీగఢ్‌ను రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్రంగా ఖండించారు .
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌లు వెంటనే హర్యానా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చండీగఢ్ ను పంజాబ్ రాష్ట్రానికి బదిలీ చేయడం గురించి ఆమ్ ఆద్మీ పంజాబ్ ప్రభుత్వం చేసిన తీర్మానంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. “పంజాబ్ ప్రభుత్వం చేసిన పని ఖండించదగినది” అని ఖట్టర్ అన్నారు. ఆప్ సర్కారు తీసుకున్న చర్యలు ఖండించదగినవనీ, ఇది చేయదగినది కాదని ఆయన నొక్కి చెప్పారు. హర్యానా, పంజాబ్‌లకు చండీగఢ్ రాజధాని అని అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ దీన్ని ఖండించాలని, హర్యానా ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఖట్టర్ డిమాండ్ చేశారు. అలాగే, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా హర్యానా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పంచకులలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పంజాబ్‌లోని AAP నేతృత్వంలోని ప్రభుత్వం మొదట SYL కాలువను నిర్మించాలనీ, పంజాబ్‌లోని హిందీ మాట్లాడే ప్రాంతాలను హర్యానాకు బదిలీ చేయాలని ఆయన అన్నారు. చండీగఢ్ హర్యానా, పంజాబ్‌లకు రాజధాని అని, అలాగే ఉంటుందని ఖట్టర్ నొక్కి చెప్పారు. చండీగఢ్‌తో పాటు ఇరు రాష్ట్రాలు మాట్లాడుకోవాల్సిన అనేక ఇతర అంశాలు ఉన్నాయని ఆయన ఉటంకిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన పేర్కొంది.
కేంద్రపాలిత ప్రాంతం మరియు ఇతర ఉమ్మడి ఆస్తుల పరిపాలనలో సమతుల్యతను దెబ్బతీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరోపిస్తూ చండీగఢ్‌ను తక్షణమే రాష్ట్రానికి మార్చాలని కోరుతూ పంజాబ్ అసెంబ్లీ శుక్రవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అంతకుముందు వాకౌట్ చేసిన ఇద్దరు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాసనసభ్యులు గైర్హాజరు కావడంతో భగవంత్ సింగ్ మన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ ఉద్యోగులకు కేంద్ర సర్వీస్ రూల్స్ వర్తిస్తాయని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ఆమోదించింది.
కేంద్రం తీసుకున్న నిర్ణయం పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధమని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం పేర్కొన్న సమాఖ్య సిద్దాంతాలను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. చండీగఢ్ పరిపాలనలో సమతుల్యతకు విఘాతం కలిగే చర్యలు తీసుకోవద్దని అన్నారు. రాబోయే రోజుల్లో, పంజాబ్ ప్రభుత్వం ఈ సమస్యపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ను కలిసే విషయం గురించి కూడా ఆలోచిస్తున్నదని తెలిపారు. కాగా, 1966లో పంజాబ్ రాష్ట్ర విభజనతో హిందీ మాట్లాడే ప్రాంతాలతో హర్యానా రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి పంజాబ్ విభజన తర్వాత చండీగఢ్ నగరం పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతోంది.
