హిమాచల్ ప్రదేశ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒక్కొక్కరూ ఔట్ అవుతున్నారు. ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరో ఇద్దరు కీలక నేతలతో బీజేపీలోకి జంప్ అవ్వగా.. తాజాగా ఆ పార్టీ మహిళా విభాగం చీఫ్ కూడా కమలదళంలోకి చేరిపోయారు. దీంతో ఆ రాష్ట్ర కార్యవర్గాన్నే ఆ పార్టీ రద్దు చేసింది. 

హిమాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్నా కొద్దీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. వ‌ర‌స‌పెట్టి ఆప్ నుంచి నాయ‌కులు బీజేపీకి వ‌ల‌స వెళ్తున్నారు. దీనికి అడ్డుక‌ట్ట వేయ‌డానికి అర‌వింద్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ ఓ నిర్ణ‌యం తీసుకున్నారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో మొత్తం రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్నే ర‌ద్దు చేశారు. 

ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం అధినేత్రి మమతా ఠాకూర్‌తో సహా ప‌లువురు నేత‌లు సోమ‌వారం బీజేపీలో చేరిన నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. పోయిన శుక్ర‌వారం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో ఆప్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అధ్యక్షుడు అనుప్ కేసరి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ ఠాకూర్, ఉనా జిల్లా చీఫ్ ఇక్బాల్ సింగ్ ఢిల్లీలోని జేపీ న‌డ్డా నివాసంలో బీజేపీలో చేరారు. ఈ ప‌రిణామాల మ‌ధ్య ఆ పార్టీ హైక‌మాండ్ ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింది. 

ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఎన్నికలకు వెళ్లే కొత్త రాష్ట్ర కార్యవర్గం త్వరలో పునర్వ్యవస్థీకరిస్తామ‌ని తెలిపారు. ‘‘ హిమాచల్ ప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యవర్గం రద్దు చేయబడింది. కొత్త రాష్ట్ర కార్యవర్గం త్వరలో పునర్వ్యవస్థీకరించబడుతుంది ’’అని సత్యేందర్ జైన్ ట్వీట్ చేశారు. 

ఢిల్లీలో వరుసగా మూడు సార్లు అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవ‌ల జ‌రిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఆ రాష్ట్రంలో మొద‌టి సారిగా ఆప్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ స్థాపించిన అన‌తి కాలంలోనే రెండో రాష్ట్రంలో అధికారం చేప‌ట్టి ఆమ్ ఆద్మీ పార్టీ రికార్డు నెల‌కొల్పింది. అయితే త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే హిమాచ‌ల్ ప్ర‌దేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక‌లపై ఆ పార్టీ ఫోక‌స్ పెట్టింది. ఈ నేప‌థ్యంలో ఆ రెండు రాష్ట్రాల్లోనూ ఇటీవ‌ల ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ ప‌ర్య‌టించారు.

గుజరాత్ రాష్ట్రంలో ప్ర‌స్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ఏళ్లుగా అక్క‌డ పాతుకుపోయిన బీజేపీని ఓడించాల‌ని ఆప్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఈ క్ర‌మంలో కొన్ని రోజుల కింద‌ట అక్క‌డ కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్ రోడ్ షో నిర్వ‌హించారు. ముందుగా స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించి గాంధీజీకి నివాళి అర్పించారు. అనంత‌రం అహ్మ‌దాబాద్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక్క సారిగా గుజ‌రాత్ ప్ర‌జ‌లు అమ్ ఆద్మీ పార్టీకి అవ‌కాశం ఇచ్చి చూడాల‌ని కోరారు. ఢిల్లీ లాగే గుజ‌రాత్ ను కూడా అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు. తమ పాల‌న ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌క‌పోతే త‌రువాత కాలంలో ఆ పార్టీనే గెలిపించాల‌ని బీజేపీని ఉద్దేశించి కేజ్రీవాల్ అన్నారు. 

అనంత‌రం వారు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో సీఎం జై రామ్ ఠాకూర్ సొంత గడ్డ‌పైన రోడ్ షో నిర్వ‌హించారు. త‌మ పార్టీకి ఒక్క సారి అవ‌కాశం ఇవ్వాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. అయితే రోడ్ షో లో ఆప్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అధ్య‌క్షుడికి స్థానం ఇవ్వ‌లేదు. కేవ‌లం భ‌గ‌వంత్ మాన్, కేజ్రీవాల్ లు మాత్ర‌మే హైలెట్ అయ్యారు. ఇదే కోపంతో ఆ రాష్ట్ర అధ్య‌క్షుడు అనుప్ కేసరి బీజేపీలో చేరారు. ఈ విష‌యాన్ని చేరిక సంద‌ర్బంగా ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు.