పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించిన తరువాత మొట్టమొదటి సారిగా అమృత్‌సర్‌లో భారీ రోడ్ షో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ రోడ్ షోలో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ కు కాబోయే సీఎం భగవంత్ మాన్ పాల్గొంటారు. 

పంజాబ్ (Punjab) అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (aam admi party) ఘ‌న విజ‌యం సాధించింది. 117 అసెంబ్లీ స్థానాల్లో 92 స్థానాలు కైవ‌సం చేసుకొని క్లీన్ స్వీప్ చేసింది. ద‌శ‌బ్దాలుగా పంజాబ్ లో పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీని చీపురుతో ఊడ్చేసింది. అయితే రాష్ట్రంలో పంజాబ్ అఖండ విజ‌యం త‌రువాత మొద‌టి సారిగా నేడు అమృత్‌సర్‌ (Amritsar)లో ఆమ్ ఆద్మీ పార్టీ మెగా రోడ్ షో (mega road show) నిర్వ‌హించనుంది. ఇందులో కాబోయే ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ (Bhagwant Mann), ఆప్ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పాల్గొననున్నారు.

ఈ వివ‌రాల‌ను భ‌గ‌వంత్ మాన్ మీడియాతో వెల్ల‌డించారు. ‘‘ పంజాబ్ ప్రజలకు మేము చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి గురు సాహిబ్ ఆశీర్వాదం తీసుకుంటాము. రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు మా జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు అమృత్‌సర్ (రోడ్‌షో కోసం) వస్తున్నారు ’’ అని ఆయ‌న పేర్కొన్నారు. 

పంజాబ్ లోని ధురి ( Dhuri) స్థానం నుంచి 58,000 ఓట్ల ఆధిక్యతతో భ‌గ‌వంత్ మాన్ విజ‌యం సాధించారు. శుక్రవారం మొహాలీలో జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆయ‌న‌ ఆప్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. శనివారం చండీగఢ్‌ (Chandigarh)లోని రాజ్‌భవన్‌ (Raj Bhavan)లో గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ (Banwarilal Purohit)తో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుకు దావా వేశారు. స్వ‌తంత్ర స‌మ‌ర‌యోధుడు భగత్ సింగ్ స్వగ్రామమైన ఖట్కర్ కలాన్‌లో మార్చి 16న భగవంత్ మాన్ ప్రమాణస్వీకారోత్సవం నిర్వ‌హించ‌నున్నారు. 

పంజాబ్‌లోని కొత్త ప్రభుత్వం పాలనను ప్రజల ఇంటి వద్దకు తీసుకెళ్లడానికి కృషి చేస్తుందని భ‌గ‌వంత్ మాన్ చెప్పారు. ప్ర‌జ‌లు స‌మ‌స్య‌ల పరిష్కారాల కోసం రాష్ట్ర రాజధానికి రావాల్సిన అవ‌సరం లేద‌ని తెలిపారు.‘‘ ప్రజలకు ఇళ్లలో కూర్చొని అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తాం. దాదాపు ఎక్కువ సంఖ్య‌లో ప్ర‌జ‌లు ప‌ని కోసం చండీగ‌ఢ్ కు రావాల్సిన అవ‌స‌రం లేద‌ని కోరుకుంటున్నాను ’’ అని ఆయ‌న తెలిపారు. 

కాగా మొత్తంగా 117 అసెంబ్లీ స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లతో భారీ విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ 18 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ రెండు, శిరోమణి అకాలీ దాలి మూడు స్థానాల్లో విజయం సాధించాయి. ఈ సారి నిర్వ‌హించిన ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల‌ను కూడా ఓడించింది. ప్ర‌స్తుత సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ(charanjith singh channi) రెండు స్థానాల నుంచి ఓడిపోయారు. అలాగే కాంగ్రెస్ పంజాబ్ అధ్య‌క్షుడు అమ‌రీంద‌ర్ సింగ్ (amarinder singh) కూడా ఓట‌మి పాల‌య్యారు. అలాగే మ‌రో సీనియ‌ర్ నాయకుడు ప్ర‌కాష్ సింగ్ బాద‌ల్ కూడా అప‌జ‌యం పొందారు. ఈ ఎన్నిక‌ల్లో అకాలీద‌ళ్-బ‌హుజ‌న్ స‌మాజ్ వాదీ పార్టీతో క‌లిసి పోటీ చేసింది. ఆ కానీ పొత్తు ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. నిజానికి అకాలీద‌ళ్ కు పంజాబ్ లో ప‌ట్టు ఉండేది. ఒక సారి సొంతంగా, రెండు సార్లు బీజేపీ తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇటీవ‌ల కేంద్రంలోని బీజేపీ తీసుకొచ్చిన మూడు రైతు చ‌ట్టాల‌ను ఆ పార్టీ వ్య‌తిరేకించింది. దీంతో బీజేపీతో సంబంధాలు తెంచుకుంది. దీంతో బీజేపీ ఒంట‌రిగా, అకాలీద‌ల్-బీఎస్పీ క‌లిసి పోటీ చేశాయి.