బీజేవైఎం జాతీయ కార్యదర్శి తజిందర్ బగ్గా అరెస్టు సమయంలో పంజాబ్ పోలీసులు క్రూరంగా వ్యవహరించారని ఆయన తల్లి కమల్జీత్ కౌర్ అన్నారు. ప్రొటోకాల్ పాటించలేదని తెలిపారు. ఢిల్లీ సీఎం తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ నేత తజిందర్ బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్టు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన తల్లి కమల్జీత్ కౌర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఆరోపణలు చేశారు. ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. తన బిడ్డ అరెస్టు సమయంలో పంజాబ్ పోలీసులు ప్రోటోకాల్ పాటించడంలో విఫలం అయ్యారని అన్నారు. అరెస్టుకు సంబంధించి తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని అన్నారు.
మత విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న కారణంతో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జాతీయ కార్యదర్శి తజిందర్ పాల్ సింగ్ బగ్గాపై నేరపూరిత బెదిరింపుల కింద కేసు పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 1న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే శుక్రవారం ఉదయం ఢిల్లీలోని తిలక్ నగర్ లోని ఆయన నివాసం నుంచి పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ అరెస్టు విషయంలో బగ్గా తల్లి మాట్లాడారు. పోలీసు సిబ్బంది ఇంట్లో నుంచి బలవంతంగా ఆయనను బయటకు లాగారని ఆరోపించారు. ‘‘ వారు (బగ్గాకు) తలపాగా ధరించడానికి కూడా సమయం ఇవ్వలేదు’’ అని ఆమె చెప్పింది. బగ్గా అరెస్టుకు సంబంధించిన ఎలాంటి పత్రాలనూ పంజాబ్ పోలీసులు సమర్పించలేదని అన్నారు. స్థానిక పోలీసు విభాగానికి సమాచారం ఇవ్వలేదని కమల్జీత్ కౌర్ ఆరోపించారు. పంజాబ్ పోలీసులు గూండాల్లా వ్యవహరించారని, సివిల్ దుస్తుల్లో వచ్చి అతన్ని తీసుకెళ్లారని ఆరోపించారు. ఇది కిడ్నాప్ కాకపోతే మరేమటని ఆమె ప్రశ్నించారు.
తజిందర్ తన తండ్రికి ఫొన్ చేయలని ప్రయత్నించినప్పుడు పంజాబ్ పోలీసు సిబ్బంది అతని ఫోన్ లాక్కుని కొట్టారని కమల్జీత్ కౌర్ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులోనూ ఎలాగో కష్టపడి తండ్రికి కాల్ చేశారని చెప్పారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు తాను ఫోన్ చేశామని తెలిపారు. అయితే ఈ అరెస్టుపై ఎస్ హెచ్ వో తనకేమీ తెలియదని చెప్పారని అన్నారు. అరెస్టు చేసిన 10-15 నిమిషాల తర్వాత ఇద్దరు వ్యక్తులు జనక్ పూరి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారని తెలిపారు. ఇది ప్రొటకాల్ ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు.
'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాను అబద్ధం అని పిలవడం ద్వారా ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కశ్మీరీ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని బగ్గా తల్లి అన్నారు. ‘1947 తర్వాత జరిగిన అతిపెద్ద మారణహోమాన్ని చవిచూసిన ప్రజల పట్ల కేజ్రీవాల్ సున్నితంగా వ్యవహరించారు. ఆయన తన ‘అగౌరవకరమైన’ ప్రకటనకు క్షమాపణ చెప్పి ఉండాల్సింది. కానీ అతను నిరాకరించాడు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత (తజిందర్ బగ్గా) క్షమాపణ చెప్పేంత వరకు తనను ప్రశాంతంగా బతకనివ్వబోనని హెచ్చరించారు. అయితే బగ్గా చేసిన ప్రకటనను ఢిల్లీ సీఎం వక్రీకరించారు. చివరకు కేజ్రీవాల్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి తజిందర్ బగ్గాను అరెస్టు చేశారు.’’ అని కమల్జీత్ కౌర్ ఆరోపించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గూండాయిజాన్ని ఆశ్రయించకూడదని ఆమె అన్నారు. ‘ మీకు ఏదైనా సమస్య ఉంటే, సరైన రీతిలో ఢిల్లీ పోలీసులతో ఎఫ్ఐఆర్ దాఖలు చేయండి. మేము కోర్టులో ఈ కేసుపై సరిగ్గా పోరాడుతాం. అప్పుడు తప్పు ఏంటో, ఒప్పు ఏంటో చట్టబద్ధంగా నిర్ణయించబడతాయి’’ అని ఆమె అన్నారు. బీజేపీ నేత కపిల్ మిశ్రా తనకు ఇప్పటికే బెదిరింపు వచ్చిందని, ఆయన తర్వాతి స్థానంలో తానే ఉంటానని బెదిరించారని కమల్జీత్ కౌర్ ఆరోపించారు.
