హైదరాబాద్: బిజెపి పట్ల తెలుగు ముఖ్యమంత్రులు భిన్న వైఖరులు అవలంబిస్తున్నారు. బిజెపితో సంబంధాల విషయంలో ఇరువురి మధ్య భిన్నాభిప్రాయాలున్నట్లు అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజెపితో స్నేహాన్ని కోరుతుండగా, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాత్రం బిజెపిపై పోరాటాన్ని ఎంచుకున్నారు. 

ముఖ్యమంత్రుల భిన్నాభిప్రాయానికి ఇరు రాష్ట్రాల్లో నెలకొన్ని విభిన్న రాజకీయ పరిస్థితులే కారణం. ఆదివారంనాడు శాసనసభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన బిజెపి పట్ల శత్రువైఖరిని అవలంబించాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. ప్రధాని మోడీపై, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మోడీ చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ గుర్తు చేశారు. తల్లిని చంపి బిడ్డను కాపాడారని మోడీ వ్యాఖ్యానించ్ారని, మోడీ అటువంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రోజును అమిత్ షా చీకటి రోజుగా అభివర్ణించారని, తెలంగాణ పట్ల అమిత్ షా తన వైఖరి మార్చుకోవాలని కూడా అన్నారు. 

తెలంగాణలో టీఆర్ఎస్ కు బలమైన ప్రతిపక్షం లేదు. ఈ స్థితిలో కేసీఆర్ ను చిక్కుల్లో పడేస్తూ తెలంగాణలో బలాన్ని పెంచుకోవాలని బిజెపి వ్యూహరచన చేసి అమలు చేస్తోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారాలని చూస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ కు తెలుగుదేశం పార్టీ రూపంలో బలమైన ప్రత్యర్థి ఉంది. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ టీడీపికి బలమైన క్యాడర్ ఉంది. తెలుగుదేశం పార్టీని పక్కకి నెట్టి బిజెపి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం లేదు. దాంతో లక్ష్యాలను సాధించడానికి కేంద్రంతో సఖ్యతతో మెలగాలని జగన్ భావిస్తున్నారు. 

రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ముందు జగన్ ప్రధాని మోడీతోనూ అమిత్ షాతోనూ మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. 

ఆర్థికంగా రెండు రాష్ట్రాల పరిస్థితి కూడా అంత బాగా ఏమీ లేదు. ఎన్నికల హామీలను అమలు చేయడానికి కేంద్ర సాయం తప్పనిసరి. రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో కేంద్రం కేసీఆర్ చేతులను దాదాపుగా కట్టేసింది. కాంగ్రెసును అసెంబ్లీ లోపల, బయట కేసీఆర్ తీవ్రంగా దెబ్బ తీసినప్పటికీ బిజెపి రూపంలో ముప్పు పొంచి ఉంది. ఈ స్థితిలో బిజెపిపై పోరాటాన్నే కేసీఆర్ ఎంచుకున్నారు. కానీ జగన్, అందుకు భిన్నమైన వైఖరితో ఉన్నారు.