బీఆర్ఎస్ అధినేత  కేసీఆర్ మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో వీలైనన్నీ ఎక్కువ స్థానాలు గెలుచుకునేలా వ్యుహాలు రచిస్తున్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీని తొలిసారిగా తెలంగాణ వెలుపల ఎన్నికల బరిలో నిలిపేందుకు సిద్దమయ్యారు. ఇందుకు మహారాష్ట్రను ఎంచుకున్నారు. బీఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న కేసీఆర్.. ఆ మేరకు వ్యుహాలు రచిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ల నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ.. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రపైనే కేసీఆర్ దృష్టి సారించారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలో నిలపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రెండు బహిరంగ సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు మహారాష్ట్రలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతల కూడా బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు.

మహారాష్ట్రలో నిర్వహించిన రెండు సభల్లో కూడా తెలంగాణ మోడల్ గురించి కేసీఆర్ వివరించారు. మహారాష్ట్రలో అన్ని రకాలుగా వనరులు ఉన్నా ఎందుకు ఈ దురవస్థ అని అక్కడ పాలకులను ప్రశ్నించారు. కంధార్‌ లోహా సభలో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీ రిజిస్ట్రేషన్‌ చేయించామని చెప్పారు. వచ్చే మహారాష్ట్ర స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని ప్రకటించారు. రైతులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. వచ్చే జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చూపెట్టాలి అని అన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి దూకుడుగా ప్రచారం నిర్వహించాలని అక్కడి నాయకులకు సూచించారు. ఇటీవల హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కూడా మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

అలాగే మహారాష్ట్రకు చెందిన కొందరు నేతలతో కేసీఆర్.. తరుచూ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ అక్కడ అనుసరించాల్సిన వ్యుహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మహారాష్ట్రలోని తూర్పు ప్రాంతంలోని విదర్భలో కూడా సభ నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సభ తర్వాత పశ్చిమ ప్రాంతంలోని మరో జిల్లాలో కూడా బహిరంగ సభ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. మహారాష్ట్రలోని ముఖ్య నగరాలైన ముంబై, పూణే, నాగ్‌పూర్, ఔరంగాబాద్‌లలో త్వరలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలని కూడా కేసీఆర్ యోచిస్తున్నారు.

అయితే మహారాష్ట్రలోని 34 జిల్లా పరిషత్‌లలో కనీసం 12 స్థానాల్లోనైనా విజయం సాధించాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుందని ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.