కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పాట్నాలో ఈ నెల 23న విపక్షాల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. 

కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలే ఏకతాటిపై వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీహార్‌ రాజధాని పాట్నాలో ఈ నెల 23న విపక్షాల సమావేశం నిర్వహించనున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. 

ఈ సమావేశానికి దేశంలోని మెజారిటీ విపక్ష పార్టీలు హాజరవుతున్నాయి. కేసీఆర్ కూడా గత ఏడాది కాలంగా.. బీజేపీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని ప్రకటనలు చేశారు. కేంద్ర విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో విపక్ష నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. కాంగ్రెస్ మినహా వివిధ విపక్షాల నాయకుల వద్దకు కేసీఆర్ స్వయంగా వెళ్లి మంతనాలు జరిపారు. గత ఏడాది ఆగస్టు 31న పాట్నాలో నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్, లాలూ ప్రసాద్‌లతో సమావేశమై ‘‘బీజేపీ-ముక్త్ భారత్’’కు కేసీఆర్ పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో తృతీయ కూటమి ఏర్పాటు చేసి తనకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే స్వారత్రిక ఎన్నికలకు అయ్యే ఖర్చునంతా భరిస్తానని కేసీఆర్ చెప్పినట్టుగా ప్రచారం సాగింది. 

అయితే అలాంటి కేసీఆర్.. ఈ నెల 23న పాట్నాలో జరనున్న విపక్షాల కీలక సమావేశానికి ఎందుకు దూరంగా ఉంటున్నారనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీని వెనక పెద్ద కథే ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ కేసు నుంచి తన కుమార్తెను కాపాడుకోవడానికి.. కొందరు బీజేపీ పెద్దలతో కేసీఆర్ అంతర్గత మంతనాలు జరిపారని.. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా కేసీఆర్ తన ప్రసంగాలలో బీజేపీపై విమర్శలను తగ్గించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే బీజేపీ ముక్త్ భారత్ అని పిలునిచ్చిన కేసీఆర్.. బీజేపీ వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు నితీష్ కుమార్ ప్రయత్నాల్లో కూడా చేరలేదు. 

ఈ క్రమంలోనే విపక్షాలు కూడా కేసీఆర్ వ్యవహార శైలిని నమ్మడం లేదని.. ఈ క్రమంలోనే విపక్షాల భేటీకి ఆహ్వానించలేదని తెలుస్తోంది. కేసీఆర్‌ను విపక్షాల సమావేశానికి ఆహ్వానించలేదని జేడీయూ ముఖ్య అధికార ప్రతినిధి కేసీ త్యాగి స్వయంగా వెల్లడించారు. విపక్షాల పార్టీలు వారిలో వారే విడిపోయారని బీజేపీ చేస్తున్న విమర్శలపై కేసీ త్యాగి స్పందించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా వారి నిబద్ధతను స్పష్టం చేయనందున.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (బీజేడీ), తెలంగాణ సీఎం కేసీఆర్ (బీఆర్‌ఎస్), ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి (బీఎస్పీ), వైఎస్ జగన్ (వైసీపీ), సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (శిరోమణి అకాలీదళ్), హెచ్‌డీ కుమారస్వామి (జేడీఎస్)లకు విపక్షాల సమావేశానికి ఆహ్వానించలేదని చెప్పారు. 

ఇక, ఈ సమావేశానికి కాంగ్రెస్‌, ఎన్సీపీ, జేడీయూ, ఉద్దవ్ శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆప్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ.. తదితర పార్టీలు హాజరుకానున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఇన్ని పార్టీలు ఏకతాటిపైకి రావడం కూడా ఇదే తొలిసారి కావచ్చు. అయితే ఇటీవలి కాలంలో కేసీఆర్‌తో చాలా సఖ్యతగా మెలిగిన పలువురు విపక్ష నేతలు కూడా ఈ సమావేశానికి హాజరుకావడం కూడా చర్చనీయాంశంగా మారింది. 

బీజేపీకి, కాంగ్రెస్‌లకు సమదూరంలో ఉండాలని కేసీఆర్.. దేశంలోని కొన్ని పార్టీలు అయినా తనతో కలిసి నడుస్తాయని భావించారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌.. పలు సందర్బాల్లో కేసీఆర్‌తో సమావేశమై చర్చలు జరిపారు. కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభకు కూడా హాజరయ్యారు. అయితే ఇప్పుడు వారు కూడా కేసీఆర్‌కు ఆహ్వానం లేని.. విపక్ష పార్టీల సమావేశానికి హాజరుకానుండటంపై పలు ఆసక్తికర చర్చలు తెరమీదకు వస్తున్నాయి. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కవిత విచారణకు ముందు.. కేసీఆర్ బహిరంగ సభలలో, ప్రెస్‌మీట్లలో కేంద్రంలోని బీజేపీపై, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించేవారు. సమాఖ్య స్పూర్తికి మోదీ సర్కార్ విఘాతం కలిగిస్తోందని ఆరోపణలు చేశారు. తెలంగాణకు అభివృద్దికి అడ్డుపడుతుందని.. ధాన్యం కొనుగోలుపై పార్లమెంట్ వేదికగా పోరాటం కూడా కొనసాగించారు. అయితే గత కొంతకాలంగా బీజేపీపై కేసీఆర్‌ విమర్శల పదును తగ్గడం.. తన ప్రసంగాల్లో కాంగ్రెస్‌ను మాత్రం టార్గెట్ చేయడంతో విపక్ష పార్టీల నేతలు ఆయనను నమ్మడం లేదనే ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే విపక్షాల భేటీకి ఆహ్వానం అందలేదని చెబుతున్నారు.