తాను కాలేజీలో చదువుకునేటప్పుడు 600మందిలో ఒక్కతే అమ్మాయినని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ సుధామూర్తి తెలిపారు. ఆమె... బిగ్ బీ అమితాబ్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 11కి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఎపిసోడ్ నవంబర్ 29 శుక్రవారం ప్రసారం కానుంది. కాగా... దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు.. ఆ ప్రోమోలో సుధామూర్తి పలు ఆసక్తి కర విషయాలను పంచుకున్నారు.

1968లో తాను ఇంజనీరింగ్ చదవాలనుకున్నప్పుడు తండ్రి తిరస్కరించారని చెప్పారు. అలా చేస్తే మన కమ్యూనిటీలో నిన్నెవరూ పెళ్లి చేసుకోరని హెచ్చరించారని గుర్తుచేసుకున్నారు.అయితే తాను మాత్రం ఇంజనీరింగ్ చదివేందుకే నిర్ణయించుకున్నానని చెప్పారు. కర్ణాటకలోని హుబ్లిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో తాను చేరానని.. 599 మంది మగ విద్యార్థులు ఉన్న ఆ కాలేజీలో తాను ఒక్కదాన్నే మహిళా స్టూడెంట్‌ని అని చెప్పారు.

 

ముందుగా తన కాలేజీ జీవితం గురించి  ఆమె తెలిపారు. ‘‘ నేను కర్ణాటకలోని హుబ్లీలో ఇంజనీరింగ్ చేశా. కాలేజీలో చేరే సమయానికి 599మంది అబ్బాయిలు ఉండేవారు. నేను ఒక్కదాన్నే అమ్మాయిని. అందుకే మా కాలేజీ ప్రిన్సిపల్ నాకు కొన్ని కండిషన్ పెట్టారు. నేను చీర మాత్రమే కట్టుకొని కాలేజీకి రావాలని, కాలేజీ క్యాంటీన్ వైపు వెళ్లకూడదని, అబ్బాయిలతో మాట్లాడకూడదని నిబంధనలు పెట్టారు. వాటన్నింటికీ నేను అంగీకరించాను.’’

‘‘ చీర కట్టుకోవడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. క్యాంటీన్ లో ఫుడ్ ఎలాగూ బాగుండదు కాబట్టి అటువైపు వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. ఇక మూడోది అబ్బాయిలతో మాట్లాడటం. మొదటి సంవత్సరం నేను వాళ్లతో మాట్లాడలేదు. కానీ నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని తెలిసి రెండో సంవత్సరం నుంచి వాళ్లే నాతో మాట్లాడటం మొదలుపెట్టారు.’’ అని తన కాలేజీ జీవితం గురించి చెప్పుకొచ్చారు.

తాను చదువుకున్న కాలేజీలో కనీసం టాయిలెట్ వసతి కూడా లేదని చెప్పారు. అందుకే ఇన్ఫోసిస్ తరుపున దాదాపు 16వేల టాయిలెట్స్ నిర్మించినట్టు తెలిపారు. దేవదాసీ వ్యవస్థను రూపుమాపేందుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తరుపున ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఆ సమయంలో ఎదురైన సవాళ్లను కూడా వివరించారు.