మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నుపుర్ శర్మ‌పై ఓ కశ్మీరీ యూట్యూబర్ వీడియో అప్‌లోడ్ చేశాడు. అందులో నుపుర్ శర్మ తలనరికేస్తున్నట్టుగా ఉన్నది. ఈ వీడియోపై అభ్యంతరాలు రావడంతో జూన్ 11వ తేదీన జమ్ము కశ్మీర్ పోలీసులు యూట్యూబర్ ఫైజల్ వనీని అరెస్టు చేశారు.

న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నుపుర్ శర్మపై రెచ్చగొట్టేలా ఓ యూట్యూబర్ వీడియో తీశాడు. కశ్మీర్‌కు చెందిన ఫైజల్ వనీ నుపర్ శర్మ ఫొటోను పెట్టుకుని ఆమెను హతమారుస్తున్నట్టుగా ఓ వీడియో తీశాడు. ఆ వీడియోను తన యూట్యూబ్ చానెల్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియోపై అభ్యంతరాలు వచ్చాయి. జమ్ము కశ్మీర పోలీసులు యూట్యూబర్ ఫైజల్ వనీని అరెస్టు చేశారు.

ఫైజల్ వనీ ఓ యూట్యూబ్ చానెల్ నడుపుతున్నాడు. డీప్ పెయిన్ ఫిట్నెస్ అనే ఓ ఫిట్నెస్ చానెల్ చానెల్ ఆయన నడుపుతున్నాడు. వీడియోలో ఆ యూట్యూబర్ తన బాడీ చూపిస్తూ కనిపించాడు. ఓ కత్తిని గాలిలో తిప్పుతూ.. నుపుర్ శర్మ ఫొటోను నరికేస్తున్నట్టుగా ఉన్నది. నుపుర్ శర్మ తల నరికేస్తున్నట్టుగా ఆ ఫొటోను నరికేశాడు. మహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన ఈ చర్యకు పాల్పడుతున్నట్టుగా ఉన్నది. ఈ వీడియో వైరల్ అయింది. దీనిపై అభ్యంతరాలు రావడంతో ఆయన ఆ వీడియోను తొలగించాడు.

ఈ వీడియో అత్యల్ప సమయంలోనే వైరల్ అయిందని యూట్యూబర్ ఫైజల్ వనీ చెప్పాడు. ఔను.. ఆ వీడియో నేను తీశానని పేర్కొన్నాడు. కానీ, తాను ఏ దురుద్దేశంతోనూ ఆ వీడియో తీయలేదని వివరించాడు. ఆ వీడియోను తాను డిలీట్ చేశానని తెలిపాడు. ఈ వీడియో ఎవరినైనా బాధించి ఉంటే అందుకు క్షమాపణలు చెప్పాడు.

ఇదిలా ఉండగా, ముహమ్మద్ ప్రవక్తపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుండి సస్పెండ్ అయిన నూపుర్ శర్మను ఉరి తీయాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎంపీ ఇంతియాజ్ జలీల్ శుక్రవారం అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఇస్లాంను శాంతి మతంగా అభివర్ణించారు. అయితే ప్రజలు కోపంగా ఉన్నారని పేర్కొన్నారు. నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు చేప‌ట్టార‌ని గుర్తు చేశారు. ‘‘ ఆమెను తేలికగా వదిలేస్తే ఇవే విషయాలు కొనసాగుతాయి. ఏదైనా మతం లేదా వర్గాల విష‌యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తులపై క‌ఠిన చట్టం అవసరమ‌ని జ‌లీల్ అన్నారు.