వలస వెళ్లిన కాశ్మీర్ పండిట్లు తిరిగి తమ సొంత ప్రాంతానికి వచ్చిన తరువాత వారిని ఎవరూ అక్కడి నుంచి పంపించలేరని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. వారికి భద్రత, జీవనోపాధిని కల్పించాల్సి ఉంటుందని అన్నారు. నాలుగు దశాబ్దాలుగా పండిట్లు వారి ఇంటి నుంచి దూరమయ్యారని తెలిపారు.
కాశ్మీరీ పండిట్‌లు తిరిగి వచ్చినప్పుడు వారినెవరూ అక్కడి నుంచి కదిలించలేరని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆదివారం నవ్రే వేడుకల చివరి రోజు సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాశ్మీరీ హిందూ సమాజాన్ని ఉద్దేశించి భగవత్ మాట్లాడారు.
ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ‘‘ కాశ్మీరీ పండిట్లు తమ ఇళ్లకు తిరిగి వచ్చే రోజు చాలా దగ్గర్లోనే ఉందని నేను భావిస్తున్నాను. ఆ రోజు త్వరలో రావాలని కోరుకుంటున్నాను ’’ అని తెలిపారు. కాశ్మీరీ పండిట్లకు భద్రత, జీవనోపాధికి హామీ ఇస్తే వారంతా తిరిగి వెళ్తారని చెప్పారు. “ మేము తీవ్రవాదం కారణంగా (కశ్మీర్) విడిచిపెట్టాము. అయితే మేము ఇప్పుడు తిరిగి వస్తే మా భద్రత, జీవనోపాధికి హామీ ఇవ్వాలి. దీంతో మేము హిందువులుగా, భారతభక్తులుగా తిరిగి వస్తాం అని, మమ్మల్ని ఎవరూ స్థానభ్రంశం చేయడానికి సాహసించని విధంగా మేము జీవిస్తాం అని సంఘం తీర్మానం చేయాలి.” అని మోహన్ భగవత్ అన్నారు.
“ కశ్మీరీ పండిట్‌లు గత మూడు నాలుగు దశాబ్దాలుగా మన సొంత దేశంలో తమ ఇంటి నుంచి నిర్వాసితులయ్యారు. ఈ పరిస్థితిలో వారు ఓటమిని అంగీకరించకుండా, సవాళ్లను ఎదుర్కోవడం అత్యవసరం ” అని ఆర్ఎస్ఎస్ చీఫ్ తెలిపారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా 1990లలో కాశ్మీరీ పండిట్ల వలస దురదృష్టకర వాస్తవికతను ప్రదర్శించిందని అన్నారు. “ ఈ సినిమాపై కొంత మంది అనుకూలంగా ఉన్నారు, కొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే మనందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిన కాశ్మీరీ పండిట్ల తీవ్ర విషాదం దురదృష్టకర వాస్తవాన్ని ఈ సినిమా ప్రదర్శించింది’’ అని చెప్పారు.
“ కశ్మీరీ పండిట్ల సమస్యను ప్రజల అవగాహన ద్వారా పరిష్కరిస్తామని, ఆర్టికల్ 370 వంటి అడ్డంకులను తప్పనిసరిగా తొలగించాలని నేను 2011లో చెప్పాను. ఈ 11 ఏళ్లలో మా సమిష్టి ప్రయత్నాల కారణంగా, ఇకపై ఆర్టికల్ 370 లేదు ” అని మోహన్ భగవత్ అన్నారు.
మార్చి 11వ తేదీన విడుదలైన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా 1990లో కాశ్మీర్ నుండి వలస వెళ్లిన పండిట్‌లు, పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదుల అతి కిరాతక చర్యలు వంటివి ఆధారంగా చేసుకొని చేసుకొని రూపొందించారు. అగ్నిహోత్రి రచన, దర్శకత్వం వహించి, జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం రాజకీయ దుమారాన్ని రేకెత్తించింది.దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఈ చిత్రం ఆకర్శిస్తోంది. ఈ సినిమాకు హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్ సహా అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పన్ను మినహాయించారు.
ఈ ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా దేశ వ్యాప్తంగా చర్చను రేకెత్తించింది. కాంగ్రెస్ నాయకులు బీజేపీపై, బీజేపీ నాయకులు కాంగ్రెస్ పై విమర్శలు చేసుకున్నారు. అనేక మంది ప్రముఖులు ఈ సినిమాపై తమ అభిప్రాయాలు తెలిపారు. ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై దాడి జరిగింది. ఈ ది కాశ్మీర్ ఫైల్స్ పై సినిమాపై, కాశ్మీర్ పండిట్లపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఇంటిపై బీజేవైఎం కార్యకర్తలు దాడి చేశారు.
