శ్రీనగర్: తనకు కబుర్లు చెప్పిన తాత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించడంతో మూడేళ్ల చిన్నారి తల్లడిల్లిపోయాడు. తాతా.. లే అంటూ అచేతనంగా పడిపోయిన తాతను లేపేందుకు ప్రయత్నించాడు. తాతపై కూర్చొని అతనిని తట్టి లేపేందుకు ప్రయత్నించాడు. ఈ దృశ్యాలను చూసిన ఆర్మీ  సిబ్బంది ఆ బాలుడిని తల్లికి అప్పగించారు.

జమ్మూ కాశ్మీర్ లోని సోపూర్ లో బుధవారం నాడు ఉదయం ఏడు గంటల సమయంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సమయంలో మూడేళ్ల బాలుడితో కలిసి ఆ వ్యక్తి అదే దారిలో వెళ్తున్నాడు. ఉగ్రవాదుల జరిపిన కాల్పల్లో ఆయనకు రెండు తూటాలు తగిలి ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. 

తాత శరీరం గుండా రక్తం కారుతోంది. శరీరంలో చలనం లేదు. దీంతో ఆ బాలుడు అక్కడే కూర్చొని ఏడ్చాడు. ఈ దృశ్యాలను చూసిన భద్రతా దళాలు ఆ బాలుడిని సురక్షితంగా అక్కడినుండి తరలించారు.

ఓ భద్రతా దళ అధికారి ఆ బాలుడిని అక్కడినుండి సురక్షితంగా తరలించారు. అంతేకాదు తన వాహనంలో ఆ బాలుడిని తీసుకెళ్లే సమయంలో చాక్లెట్ ఇస్తానని చెప్పినా కూడ ఆ బాలుడు పట్టించుకోలేదు. తన తాత గురించే పోలీసులకు చెప్పుకొంటూ కన్నీళ్లు పెట్టుకొన్నాడు.

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ వృద్దుడితో పాటు సీఆర్‌ఫీఎఫ్ జవాన్ మరణించాడు. మరో ముగ్గురు ఆర్మీ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.