జమ్మూ కాశ్మీర్ లో ప్రజా ప్రతినిధులు హత్యలు కలవరపెడుతున్నాయి. ఓటింగ్ ద్వారా ఎన్నికైన సర్పంచ్ లను లక్ష్యంగా చేసుకునే హత్యలు జరుగుతున్నాయి. గడిచిన పది రోజుల్లో ఇలాంటి తరహా మూడు హత్యలు జరిగాయి. దీంతో జమ్మూ కాశ్మీర్ లోని నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికైన పంచాయతీ సభ్యులపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని అదౌరాకు చెందిన సర్పంచ్ షబీర్ అహ్మద్ మీర్ హత్యకు గురయ్యారు. గత 10 రోజుల్లో ఇలాంటి తరహా హత్యలు జరగడం ఇది మూడోది కాగా గత రెండు రోజుల్లో ఇది రెండోది.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ద్వారా ఎన్నికైన నాయకులు ఇటీవల హత్యలకు గురవుతున్నారు. ఇది చాలా ఆందోళన కలిగిస్తున్నారు. మార్చి 2వ తేదీన కుల్గామ్‌లో పంచాయతీ సభ్యుడిని కాల్చి చంపారు. మృతుడు మహ్మద్ యాకూబ్ దార్ జిల్లాలోని కోల్‌పోరా ప్రాంతానికి సర్పంచ్ గా ఉన్నారు. అలాగే గురువారం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP)కి విధేయుడిగా ఉన్న సర్పంచ్ సమీర్ అహ్మద్ భట్ శ్రీనగర్ శివార్లలోని ఖోన్‌మోహ్ ప్రాంతంలోని తన ఇంటిలో హత్యకు గురయ్యారు.
ఈ విషయంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. “ కుల్గామ్‌లోని అదౌరా ప్రాంతంలో షబీర్ అహ్మద్ మీర్ అనే సర్పంచ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఉగ్రదాడి ఘటనలో అతనికి తుపాకీ కాల్పులు తీవ్రంగా తగిలాయి. వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ అతను మరణించాడు.’’ అని పేర్కొన్నారు.
“ మరణించిన సర్పంచ్ షబీర్ అహ్మద్ మీర్‌కు శ్రీనగర్‌లోని సురక్షితమైన హోటల్‌లో వసతి కల్పించారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా హోటల్ నుంచి బయలుదేరి ఇంటికి చేరుకున్నాడు. రక్షిత వ్యక్తులందరూ దయచేసి పోలీసులు సూచనలు పాటించాలని ” అని కాశ్మీర్ IGP విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. “ సర్పంచ్ షబీర్ అహ్మద్ మీర్ హత్యకు గురికావడం దిగ్భ్రాంతికి గురిచేసింది. రాజకీయ కార్యకర్తలు హత్యకు గురవుతున్నారు. మేము మా సానుభూతిని తెలియజేస్తాం. ఆపై మళ్లీ ఇలాగే జరుగుతోంది. ఈ హత్యలు ఆగిపోవాలి. ఆయన మరణమే చివరిది కావాలని నేను కోరుకుంటున్నాను. కానీ అది జరగదు’’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ హత్యను బీజేపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, జమ్మూ కాశ్మీర్ అప్నీ పార్టీ కూడా ఖండించాయి. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని PDP ఈ ఘటనపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. “ ఇది సాధారణమా ? సర్పంచ్‌లను ఇష్టానుసారంగా హత్యలు చేస్తున్నారు. ప్రభుత్వం ఓదార్చడం తప్ప చేసేది ఏమీ లేదు. మృతుడి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’’ అని పేర్కొంది.
