ఈసారి దేవ్ దీపావళి చాలా స్పెషల్ ... కాశీ గోడలపై 3Dలో సనాతన ధర్మ గాథలు
దేవ్ దీపావళి సందర్భంగా ఈసారి కాశీలో 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్ లేజర్ షో ఉంటుంది. చైత్ సింగ్ ఘాట్ వద్ద శివ మహిమ, గంగావతరణ గాథలను ప్రదర్శించనున్నారు.
వారణాసి : యోగి ప్రభుత్వం సనాతన ధర్మ వైభవాన్ని ప్రపంచానికి చాటుతోంది. ఇటీవల అయోధ్యలో దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించిన ప్రభుత్వం కాశీలో దేవ్ దీపావళిని కూడా ఇలాగే వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.
దేవ్ దీపావళి సందర్భంగా సంస్కృతి, వారసత్వం, సంప్రదాయాలను కాపాడుకుంటూనే ఆధునికతను జోడించనుంది యోగి ప్రభుత్వం. ఇందుకోసం కాశీలోని చారిత్రాత్మక ఘాట్ ల గోడలపై సనాతన ధర్మ గాథలను 3D ప్రొజెక్షన్ ద్వారా ప్రదర్శించనుంది. ఈ క్రమంలో చైత్ సింగ్ ఘాట్ వద్ద 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్ లేజర్ షో ద్వారా అరగంట పాటు శివమహిమ, గంగావతరణ గాథలను ప్రదర్శిస్తారు.
మూడు సార్లు షో ప్రదర్శన
యోగి ప్రభుత్వం దేవ్ దీపావళిని ప్రాంతీయ ఉత్సవంగా ప్రకటించి దాని వైభవాన్ని మరింత పెంచింది. ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు ఆధునికతను జోడించడం ద్వారా దేవ్ దీపావళి ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణను సంతరించుకుంది.
పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజేంద్ర కుమార్ రావత్ మాట్లాడుతూ... చైత్ సింగ్ ఘాట్ వద్ద 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్ లేజర్ షో నిర్వహిస్తామని, ఈ షో గంగావతరణ, శివమహిమలను ఆధారంగా చేసుకుని ఉంటుందని చెప్పారు. అరగంట పాటు జరిగే ఈ షోను మూడు సార్లు ప్రదర్శిస్తారు.
12 లక్షల దీపాలు, గ్రీన్ క్రాకర్స్ తో ఆకాశం వెలుగులు
కాశీలో నవంబర్ 15న దేవ్ దీపావళి జరుపుకుంటారు. దేవ్ దీపావళి సాయంత్రం ఉత్తరవాహిని గంగానది తీరంలోని పక్కా ఘాట్ ల నుంచి తూర్పు తీరం వరకు దీపాలతో వెలుగులతో నిండిపోతాయి. కుండాలు, చెరువులు, సరస్సుల చుట్టూ కూడా దీపాలను వెలిగిస్తారు. కాశీలో ప్రజల భాగస్వామ్యంతో దాదాపు 12 లక్షల దీపాలను వెలిగిస్తారు. శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ గంగా ద్వారం ఎదురుగా ఇసుక తిన్నెలపై గ్రీన్ క్రాకర్స్ తో ఆకాశంలో రంగురంగుల వెలుగులతో కనువిందు చేస్తారు.