కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో 23 ఏళ్ల యువకుడు అరుంధతి సినిమా చూసి.. అందులో హీరోయిన్ తరహా తాను కూడా ఇష్టపూర్వకంగా మరణించి మళ్లీ జన్మించాలని అనుకున్నాడు. ఒంటిపై పెట్రోల్ పొసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరణించడానికి ముందు అరుంధతి సినిమాను ఆయన 15 నుంచి 20 సార్లు చూశాడు.
బెంగళూరు: సినిమా వినోదాన్ని పంచే మాధ్యమం. అదొక కళ. దాన్ని కళగానే చూడాలి. కానీ, నిజ జీవితానికి అన్వయించి అందులో జరిగే ఘట్టాలనూ నిర్వహించాలనుకుంటే ముప్పు తప్పదు. ముఖ్యంగా ఫిక్షన్ సినిమాలను నిజ జీవితానికి అన్వయిస్తే మాత్రం ప్రమాదం వెంట వస్తుంది. ఇందుకు తాజా ఘటన ఉదాహరణ. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఓ యువకుడు అరుంధతి సినిమా చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మధుగిరి తాలూక్, గిద్దయ్యనపాల్య గ్రామానికి చెందిన రేణుక ప్రసాద్ బ్రైట్ స్టూడెంట్. పదో తరగతి వరకు క్లాసులో టాపర్‌గా ఉంటూ వచ్చాడు. 23 ఏళ్ల రేణుక ప్రసాద్ సినిమాలపై విపరీత ఆసక్తి పెంచుకున్నాడు. ఈ కారణంగానే కాలేజీ డ్రాపవుట్‌గా మిగిలాడు. తెలుగు సినిమా అరుంధతిని ఆయన ఇటీవలే 15 నుంచి 20 సార్లు చూశాడు. ఆ సినిమాను నిజ జీవితానికి దగ్గరగా ఊహించుకున్నాడు. అందులో సమస్యలు తీర్చడానికి, శత్రువు పై ప్రతీకారం తీర్చడానికి ఆమె కోరిక మేరకు ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ ఆత్మహత్య సీక్వెన్స్‌ను ఒక క్రతువుగా సినిమాలో చూపించారు.
రేణుకా ప్రసాద్ కూడా మళ్లీ జన్మించాలని తన ఇష్ట ప్రకారం మరణించాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా మరణానికి రెండు మూడు రోజుల ముందు చెప్పాడు. దీంతో పేరెంట్స్ ఆ యువకుడికి సినిమా, కల్పితం, హేతువు వంటి వివరాలు వివరించారు. కానీ, ఆ యువకుడు వాటిని చెవిన పెట్టుకోలేదు.
రేణుకా ప్రసాద్ బుధవారం బయటకు వెళ్లి పెట్రోల్ బంక్ నుంచి 20 లీటర్ల పెట్రోల్‌ను ఓ క్యాన్‌లో కొనుగోలు చేసి ఊరి చివరకు తీసుకెళ్లాడు. అందులో ఒక లీటర్ పెట్రోల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంటలతో రేణుకా ప్రసాద్ కేకలు వేస్తూ అరుపులు వేశాడు. ఈ అరుపులు విని ఆ స్పాట్‌కు దగ్గరగా పోతున్న రోడ్డు పై నుంచి పలువురు పరుగున వచ్చారు. హాస్పిటల్ తీసుకెళ్లారు. 60 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూనే రేణుకా ప్రసాద్ మరణించారు.
ఈ ఘటనపై తొడిగినహల్లి పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన గురించి తెలియగానే స్థానికులు, బంధువులు ఖంగుతిన్నారు. రేణుకా ప్రసాద్ మంచి చదువులు చదివి ఉన్నత కెరీర్ కొనసాగించాలని తాము ఆశించామని, కానీ, సినిమాల పిచ్చి ఆయన ప్రాణాలు తీసిందని రేణుకా ప్రసాద్‌కు దగ్గరి బంధువు, లెక్చరరర్ తెలిపారు.
