కరోనా కారణంగా విద్యా రంగం పూర్తిగా కుదేలయ్యింది. ఆన్‌లైన్‌‌లోనే పాఠశాలలు జరుగుతున్నాయి. అది కూడా లేకపోతే దూరదర్శన్ ఛానల్‌లో ప్రసారమయ్యే పాఠాలే ప్రస్తుతం ఆ పిల్లలకు దిక్కు. టీవీ పాఠాలు తప్పనిసరని టీచర్లు చెప్పడంతో ఓ తల్లి తన పిల్లల కోసం ఏకంగా మంగళసూత్రం తాకట్టు పెట్టింది.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం గదగ్ జిల్లా నగ్నూరు గ్రామానికి చెందిన కస్తూరి చల్వాది అనే మహిళకు నలుగురు పిల్లలు. ఆమె భర్త మునియప్ప. వీరు రోజువారీ కూలీలుగా పనిచేస్తూ  కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా పనులు లేక వీరు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో పిల్లలకు దూరదర్శన్‌లో పాఠాలు వినేందుకు ఇంట్లో టీవీ లేకపోవడంతో కస్తూరి ఏకంగా మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టింది.

అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా గ్రామస్తులకు తెలియడంతో వారికి తోచినంత సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ రూ.50 వేలు, రాష్ట్రానికి చెందిన మరో మంత్రి రూ.20 వేల చొప్పున ఆ కుటుంబానికి ఆర్ధిక సాయం అందించారు.

ఈ విషయంపై కస్తూరి మాట్లాడుతూ.. పిల్లలకు దూరదర్శన్‌లో పాఠాలు తప్పనిసరి చేశారు. టీచర్లు సైతం పాఠాలను వినాలని చెప్పారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టీవీ కొనాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. రోజువారీ కూలీ పనులు లేక.. బయట ఎక్కడా అప్పు పుట్టలేదని చేసేది లేక మంగళసూత్రం తాకట్టు పెట్టానని కస్తూరి వాపోయింది.