బెంగుళూరు:కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం రాత్రి 11:45 గంటలకు మంగళవారం నాడు విశ్వాస పరీక్షపై ఓటింగ్ నిర్వహించనున్నట్టు స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. విశ్వాస పరీక్షపై  ఓటింగ్ నిర్వహించాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు.

కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై ఓటింగ్ జరగకుండా ఉండేందుకు గాను అధికార కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ కూటమి ప్రయత్నాలు చేస్తోంది.సోమవారంనాడే విశ్వాస పరీక్షను పూర్తి చేయాలని గవర్నర్ వాజ్‌భాయ్ వాలా డెడ్‌లైన్ విధించాడు.

ఈ డెడ్ లైన్ కూడ దాటిపోయింది. సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకే గవర్నర్ సమయం ఇచ్చాడు.ఇప్పటికే పలు మార్లు గవర్నర్ డెడ్‌లైన్ విధించాడు. ఈ డెడ్ లైన్ విధించినా కూడ విశ్వాసపరీక్షపై ఓటింగ్ జరగలేదు.

సోమవారం నాడు స్పీకర్ రమేష్ కుమార్ తో సీఎం కుమారస్వామి భేటీ అయ్యారు. బలపరీక్ష కోసం తనకు సమయం ఇవ్వాలని స్పీకర్ ను సీఎం కుమారస్వామి కోరారు.

అదే సమయంలో విశ్వాస పరీక్షను సోమవారం నాడు నిర్వహిస్తానని ప్రకటించారు. విశ్వాస పరీక్షపై నిర్వహించిన చర్చపై అందరు ఎమ్మెల్యేలు మాట్లాడాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది.సభ్యుల ప్రసంగం పూర్తయ్యాకే  ఓటింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ పక్షనేత సిద్దరామయ్య అభిప్రాయపడ్డారు. 

మంగళవారం నాడు విశ్వాస పరీక్ష నిర్వహణకు సహకరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. చాలా మంది ఎమ్మెల్యేలు షుగర్, బీపీ లాంటి వ్యాధులతో ఉన్నందున రాత్రి కావస్తున్న తరుణంలో విశ్వాస పరీక్షపై చర్చను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు.