Mangalore: కర్ణాటకలో ముస్లిం వ్యక్తి హత్య నేప‌థ్యంలో అక్క‌డ ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణ నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే పోలీసులు మంగళూరు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు. మరో ఘటనలో తన పెండ్లికి నిరాకరించడంతో యువతిపై కత్తితో దాడిచేసి హత్య చేసిన తర్వాత.. తాను ప్రాణాలు తీసుకోవడానికి విషం తాగాడు ఓ యువకుడు. 

Karnataka Murder Case: క‌ర్నాట‌క‌లో మ‌రోసారి ఉద్రిక్త వాతావ‌ర‌ణ నెల‌కొంది. ఒక ముస్లిం వ్యక్తి హ‌త్య నేప‌థ్యంలో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జార‌కుండా పోలీసులు మంగళూరు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు. వివ‌రాల్లోకెళ్తే.. కర్ణాటకలోని మంగళూరు శివార్లలోని కృష్ణపురలో ఆదివారం (డిసెంబర్ 25) గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు. ఈ క్ర‌మంలోనే చ‌నిపోయిన వ్య‌క్తిని జలీల్ గా పోలీసులు గుర్తించారు. అయితే, బాధిత కుటుంబ స‌భ్యుల బంధువులు నిర‌స‌న‌తో అక్క‌డ ఉద్రిక్త‌త చోటుచేసుకుంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే పోలీసులు ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఆదివారం (డిసెంబర్ 25) ఉదయం 6 గంటల నుంచి డిసెంబర్ 27 ఉదయం 6 గంటల వరకు ఇక్కడ సెక్షన్ 144 విధించారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని సీల్ చేశారు. ఎలాంటి నేర సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డిసెంబర్ 27 వరకు ఇక్కడ మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధించారు.

శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్య‌క్తిని జలీల్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. జలీల్ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఓ దుకాణం ముందు నిలబడిన జలీల్‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడి చేశారు. ఘటన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం జలీల్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌ శశికుమార్‌ తెలిపారు. సంబంధిత సంఘ‌ట‌న గురించి వివ‌రించిన పోలీసు కమిషనర్.. ఎలాంటి నేరాలు జరగకుండా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు. డిసెంబరు 27న ఉదయం 6 గంటల వరకు సూరత్‌కల్‌, బజ్‌పే, కావూర్‌, పనంబూర్‌లో ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

ఈ ఘటన శనివారం రాత్రి 8-8:30 గంటల ప్రాంతంలో జరిగింది. సూరత్‌కల్‌ ఎప్పుడూ సున్నిత ప్రాంతమని మంగళూరు పోలీస్‌ కమిషనర్‌ శశికుమార్‌ తెలిపారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆదివారం క్రిస్మస్ కావడంతో ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. గతంలో కూడా సెన్సిటివ్ పాయింట్లుగా ఉన్న పోలీస్ స్టేషన్ల చుట్టూ 144 సెక్షన్ విధించామని వెల్లడించారు. కాగా, కాటిపళ్లలోని సూరత్‌కల్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో మృతుడు జలీల్‌కు ఫ్యాన్సీ దుకాణం ఉంది. అతను ఉడిపి సమీపంలోని కులూరు నివాసి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 8-8.30 గంటల సమయంలో ఇద్దరు దుండగులు అతని దుకాణానికి చేరుకుని కత్తితో పొడిచి పారిపోయారు.

దవాంగెరెలో మరో షాకింగ్ హత్య కేసు.. 

కర్నాటకలోని దవాంగెరె ప్రాంతంలో ఇలాంటి మరో ఉదంతం తెరపైకి వచ్చింది. ఓ యువతిని మార్గమధ్యలో కత్తితో పొడిచి హత్య చేశాడు ఓ పిచ్చి ప్రేమికుడు. నేరం చేసిన తర్వాత నిందితులు బైక్‌పై పరారయ్యారు. మృతురాలిని సుల్తానాగా గుర్తించగా, నిందితుడి పేరు సాదత్‌గా తెలిపారు. సాదత్ సుల్తానాను ప్రేమిస్తున్నాడనీ, అయితే యువతి కుటుంబానికి యువకుడు నచ్చలేదని చెప్పారు. దీంతో సుల్తానా సాదత్‌కు దూరమైంది. అనంతరం నిందితుడు సుల్తానాను హత్య చేసి విషం మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.