బెంగుళూరు: ఆన్ లైన్ క్లాసులు ఓ వ్యక్తి వివాహేతర సంబంధం బయటకు రావడానికి కారణమైంది. దీంతో తనకు భర్త నుండి విడాకులు కావాలని భార్య కోరుతోంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలోని నాగమంగళ తాలూకాలో ఈ ఘటన చోటు చేసుకొంది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న విషయం బయటకు రావడంతో తనకు విడాకులు కావాలని భార్య  కోరుతోంది.మరో మహిళతో వివాహేతర సంబంధం కలిగిన తన భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.వీరికి 18 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఇద్దరు పిల్లలున్నారు. పిల్లల వయస్సు 15, 17 ఏళ్లు.

ఆన్ లైన్ క్లాసుల కోసం  తన ఫోన్ ను కూతురికి తండ్రి ఇచ్చాడు.ఈ ఫోన్ లో మరో మహిళతో ఏకాంతంగా ఉన్న దృశ్యాలు ఆమె కంటబడ్డాయి. దీంతో ఆమె తన తల్లికి ఈ విషయాన్ని చెప్పింది. ఈ వీడియోను కూడ తల్లికి చూపించింది.తన తండ్రితో సన్నిహితంగా ఉన్న మహిళ వీరికి సమీప బంధువు. ఈ విషయమై తనకు న్యాయం చేయాలని భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తాను మాత్రం తన కుటుంబంతోనే ఉంటానని ఆయన చెబుతున్నాడు. కానీ భర్తతో విడిగా ఉంటానని ఆ మహిళ తెగేసి చెబుతోంది. దంపతులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ ఫలితం లేకుండా పోయింది.ఈ వీడియోను మహిళ అంగీకారంతోనే చిత్రీకరించాడా లేదా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.