కర్ణాటకలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో పాటు 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
కర్ణాటకలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌లతో పాటు 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈరోజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసేవారిలో.. జి పరమేశ్వర (ఎస్సీ), కేహెచ్ మునియప్ప(ఎస్సీ), కేజే జార్జ్(మైనారిటీ-క్రిస్టియన్), ఎంబీ పాటిల్(లింగాయత్), సతీష్ జార్కిహోళి (ఎస్‌టీ-వాల్మీకి), ప్రియాంక్ ఖర్గే (ఎస్సీ- కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు), రామలింగా రెడ్డి (రెడ్డి), బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్(మైనారిటీ-ముస్లిం) ఉన్నారు.
ఇందుకు సంబంధించి మల్లికార్జున ఖర్గే ఈరోజు ఉదయం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈరోజు సీఎం, డిప్యూటీ సీఎం, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారోత్సవం చేయనున్నారు. నేను కూడా అదే కార్యక్రమానికి వెళ్తున్నాను.. ఇది సంతోషకరమైన విషయం. కర్ణాటకలో కొత్త, బలమైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇది కర్ణాటకకు ప్రయోజనం చేకూరుస్తుంది. దేశంలో మంచి వాతావరణాన్ని సృష్టిస్తోంది’’ అని పేర్కొన్నారు.

ఇక, ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం వేదికగా విపక్షాల ఐక్యతను చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఇతర ప్రతిపక్ష నేతలు ఈ వేడుకకు హాజరుకానున్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. జేఎంఎం, ఆర్‌జేడి, శివసేన, ఎస్‌పీ, పీడీపీ, సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే, ఆర్‌ఎస్‌పీ, సీపీఐ(ఎంఎల్), వీసీకే, ఆర్‌ఎల్‌డీ, కేరళ కాంగ్రెస్, ఐయుఎంఎల్ నేతలను ఈ వేడుకకు ఆహ్వానించారు. అయితే టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. ఆమె తరపున హాజరు కావడానికి ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్‌ను నియమించారు.
