బెంగుళూరు: తనపై రాజకీయ కుట్రలో భాగంగానే  ఆ సీడీ బయటకు వచ్చిందని మాజీ మంత్రి రమేష్ జార్ఖిహోళి ఆరోపించారు.

మంగళవారం నాడు ఆయన బెంగుళూరులోని తన నివాసంలో ఆయన  మీడియాతో మాట్లాడారు. ఆ వీడియో సీడీ నకిలీదని ఆయన చెప్పారు. తనకు వ్యతిరేకంగా కుట్ర చేశారన్నారు.

రాసలీలల వ్యవహారంలో తాను ఉన్నానని విడుదల చేసిన సీడీలో నిజం లేదన్నారు. తాను అమాయకుడిగా ఆయన పేర్కొన్నారు. ఈ సీడీల వ్యవహారం తన దృష్టికి నాలుగు మాసాల క్రితమే వచ్చిందన్నారు.

అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని అప్పుడే తన సోదరుడికి వివరించినట్టుగా ఆయన తెలిపారు. ఈ విషయంలో న్యాయపరమైన సహకారం తీసుకొంటానని ఆయన చెప్పారు. 

మంత్రి పదవికి రాజీనామా చేయడం తన స్వంత నిర్ణయమేనని ఆయన వివరించారు. తనను రాజీనామా చేయాలని సీఎం కానీ, పార్టీ కానీ కోరలేదని ఆయన గుర్తు చేశారు.

ఈ ఫేక్ సీడీలను తయారు చేయడానికి రూ. 20 కోట్లు ఖర్చు చేశారని ఆయన చెప్పారు. బెంగుళూరులోని యశ్వంత్ పూర్, హులిమావు అనే రెండు చోట్ల ఈ కుట్ర జరిగిందని మాజీ మంత్రి చెప్పారు. 

ఈ సీడీలో ఉన్న అమ్మాయికి రూ. 5 కోట్లతో పాటు విదేశాలలో రెండు ఫ్టాట్లు ఇచ్చారని తనకు సమాచారం ఉందని ఆయన తెలిపారు.ఈ సీడీ తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసేలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ రాసలీలల సీడీ వెలుగు చూడడంతో ఈ నెల 3వ తేదీన రమేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.