Asianet News TeluguAsianet News Telugu

బెంగ‌ళూరు వ‌ర‌ద రోడ్డుపై స్కూటీ స్కిడ్.. యువ‌తి మృతి

బెంగళూరులో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో అనేక సరస్సులు, మురికినీటి కాలువలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలను వ‌ర‌ద‌నీరు ముంచెత్తడంతో ప‌రిస్థితులు దారుణంగా మారాయి. 
 

Karnataka : Scooter skids on Bengaluru flood road.. Young woman dies
Author
First Published Sep 6, 2022, 12:45 PM IST

బెంగళూరు వ‌ర‌ద‌లు:  క‌ర్నాట‌క రాజ‌ధాని బెంగళూరును వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. గ‌త 75 ఏళ్లలో సెప్టెంబరు నెలలో కురిసిన మూడో అత్యధిక వర్షపాతం ఇదేనని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్ర‌జా ఇబ్బందులు వ‌ర్ణ‌నాతీతంగా ఉన్నాయి.  ఈ క్ర‌మంలోనే వ‌ర‌ద నీటితో నిండివున్న రోడ్డుపై ఒక స్కూటీపై వెళ్తున్న ఒక యువ‌తి.. వాహ‌నం స్కీడ్ అయి ప్రాణాలు కోల్పోయింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని తాకడంతో 23 ఏళ్ల మహిళ మృతి చెందింది. బెంగ‌ళూరు నగరంలోని వైట్ ఫీల్డ్ ప్రాంతానికి సమీపంలో సోమవారం రాత్రి 9:30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ఒక పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే అఖిల ఇంటికి తిరిగి వస్తుండగా, ఆమె స్కూటీ వరదనీటితో నిండిన రోడ్డును దాటుతుండగా జారిప‌డిపోయింది. ఈ క్ర‌మంలోనే ఆమె ప‌క్క‌నే ఉన్న ఉన్న ఒక విద్యుత్ స్తంభాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. అయితే, వ‌ర్షాల కార‌ణంగా స్తంభానికి విద్యుత్ ప్ర‌వాహం ఉండ‌టంతో ఆమె  కరెంట్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయింది.

ఇదిలావుండ‌గా, క‌ర్నాట‌క‌లో వ‌ర్ష బీభ‌త్సం కొన‌సాగుతోంది. కర్నాటకలో కుండపోత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతుండగా సాధారణ జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. వరదలు, నీటి ఎద్దడి కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో మంగళవారం రాత్రిపూట వర్షం భారతదేశ సిలికాన్ వ్యాలీ బెంగళూరును కష్టాల్లోకి ప‌డేసింది. భారీ వ‌ర్షంతో ఎక్క‌డిక‌క్క‌డ వాహ‌నాలు నిలిచిపోయాయి. ఎటుచూసిన వ‌ర‌ద నీరే క‌నిపిస్తోంది. భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) ప్ర‌కారం.. కర్ణాటకలో సెప్టెంబర్ 9 వరకు భారీ వర్షాలు కురుస్తాయని, దీని కోసం రాష్ట్రంలోని అనేక జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేయబడింది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులందరూ సముద్రంలోకి వెళ్లవద్దని సంబంధిత అధికారులు హెచ్చరించారు. సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు బెంగళూరు, కొడగు, శివమొగ్గ, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడిపి, చిక్కమగళూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. 

బెంగళూరులోని కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో అనేక సరస్సులు, మురికినీటి కాలువలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలను వ‌ర‌ద‌నీరు ముంచెత్తడంతో ప‌రిస్థితులు దారుణంగా మారాయి. ఈ క్ర‌మంలోనే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరదల పరిస్థితిని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్ల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయించింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సోమవారం రాత్రి సీనియర్ మంత్రులు, జిల్లా అధికారులతో రాష్ట్రవ్యాప్తంగా-రాజధాని నగరంలో వరదల కారణంగా సంభవించిన వర్షాలు ప‌రిస్థితులు, న‌ష్టాల‌పై సమీక్ష జ‌రిపారు. వరద పరిస్థితిని ఎదుర్కోవడానికి, రోడ్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, పాఠశాలలు మొదలైన దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి బెంగళూరుకు మాత్రమే రూ.300 కోట్లు వినియోగించాల‌ని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 

వ‌ర‌ద‌నీరు తగ్గిన తర్వాత పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి బొమ్మై తెలిపారు. బెంగళూరులో మురికినీటి కాలువల నిర్మాణానికి మొత్తం రూ.1,500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటికే వివిధ జిల్లాల అధికారుల వద్ద రూ.664 కోట్లు అందుబాటులో ఉన్నాయని, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా రూ.500 కోట్లు ఇప్పటికే మంజూరయ్యాయని బొమ్మై తెలిపారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలకు సహకరించాలని పౌరులకు విజ్ఞప్తి చేస్తూ, గత 32 ఏళ్లలో (1992-93) ఇదే అత్యధిక వర్షపాతం అనీ, బెంగళూరులోని 164 సరస్సులు నీటితో నిండిపోయాయని బొమ్మై చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios