కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు, ప్రజాపనుల శాఖ మంత్రి హెచ్‌డీ రేవణ్న మరో వివాదంలో చిక్కుకున్నారు.  భారీ వర్షాలతో అవస్థలు పడుతున్న వరద బాధితులపైకి ఆయన బిస్కట్లు విసరడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. 

భారీవర్షాల కారణంగా కొడుగు జిల్లాతో పాటు పొరుగున ఉన్న హసన్‌, చిక్కమగళూరు జిల్లాలు సైతం అతలాకుతలమయ్యాయి. హాసన్‌ జిల్లా రామనాథపురలోని పునరావాస కేంద్రంలో ఆహార పదార్థాలను పంపిణీ చేసేందుకు అక్కడకు వచ్చిన మంత్రి రేవణ్న బాధితులపైకి బిస్కట్‌ పాకెట్లను విసిరేశారు. 

తమను ఓదార్చి, అండగా ఉంటామని భరోసా ఇవ్వాల్సిన మంత్రి, కుక్కలకు విసిరినట్లుగా బిస్కట్లు పారేసిన తీరుపై బాధితులు మండిపడ్డారు. వెంటనే రేవణ్న బహిరంగ క్షమాపణలు చెప్పాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.