ఖైదీలకు కర్ణాటక సర్కార్ బంపరాఫర్.. జైళ్లలో వేతనం భారీగా పెంపు
ఖైదీలకు కర్ణాటక ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. ఖైదీలకు చెల్లించే రోజువారీ వేతనాన్ని భారీగా పెంచింది. ఈ మేరకు కర్ణాటక హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

సాధారణంగా జైళ్లలో వివిధ నేరాలకు శిక్ష పడిన ఖైదీలు వివిధ పనులు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇవి చాలా తక్కువగా వుంటాయి. అయితే కర్ణాటక ప్రభుత్వం ఖైదీల విషయంలో కరుణ చూపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటకలోని మొత్తం 54 జైళ్లలో వున్న ఖైదీల సంఖ్య 3,565 వీరందరికీ ఏటా రూ.58,28,34,720 చెల్లిస్తున్నామని.. తాజాగా దీనిని మూడు రెట్లు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. తద్వారా దేశంలో అత్యధిక వేతనాలు అందుకుంటున్న ఖైదీలుగా కర్ణాటక ఖైదీలు నిలిచారు. జైలుకు వచ్చిన ఖైదీలు వివిధ పనులు చేసి రోజుకు రూ.524 అందుకుంటారు. తర్వాతి సంవత్సరం రూ.548, మూడో ఏడాది రూ.615, నాలుగో ఏడాది రూ.663 చొప్పున చెల్లిస్తారు. అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.