కర్ణాటక రాజకీయం అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన నాటినుంచి రోజుకో మలుపు తిరుగుతూ ఒక సస్పెన్స్ డ్రామాను తలిపిస్తున్నాయి. ఫలితాలు వెలువడిన తరువాత జేడీఎస్, కాంగ్రస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం నుంచి మొదలయ్యాయి. తిరిగి యెడ్యూరప్ప ముఖ్యమంత్రి అవడంతో ఈ సస్పెన్సులకు తెరపడుతోందని ఊహించారంతా. కానీ సామాన్యుల ఊహకు అందకుండా యెడ్యూరప్ప ముఖ్యమంత్రయితే అయ్యాడు కానీ మంత్రివర్గ ఏర్పాటుకు మాత్రం కేంద్ర నాయకత్వం కరుణించకుండా జాప్యం చేసింది. 

అమిత్ షా నుంచి అంగీకారం లభించడం కోసం యెడ్యూరప్ప చాలా ఢిల్లీ ట్రిప్పులు వేయవలిసి వచ్చింది కూడా. ఇలా యెడ్డీని వెయిట్ చేయించడానికి కారణం కూడా లేకపోలేదు. కర్ణాటక బీజేపీలో నూతనతరం నాయకత్వం రెడీగా లేకపోవడంతో యడ్యూరప్పకు బీజేపీ సూత్రాలకు విరుద్ధమైనప్పటికీ, 75 సంవత్సరాలకు రిటైర్మెంట్ సూత్రాన్ని కూడా పక్కనపెట్టి యడ్యూరప్పకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. 

మంత్రివర్గ విస్తరణలో కూడా అమిత్ షా తన మార్కు రాజకీయ దురంధరతను ప్రదర్శించాడని చెప్పవచ్చు. యెడ్డీకి చెక్ పెట్టేందుకు మరో మూడు పవర్ సెంటర్లుగా ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించారు. వీరిలో లక్ష్మణ్ సవాడి కూడా యెడ్యూరప్పలాగానే లింగాయత్ సామాజికవర్గానికి చెందిన నేత. 

ఇలా పూర్తిగా కర్ణాటక బీజేపీ పైన కేంద్ర నాయకత్వం పట్టుబిగించిందని చెప్పవచ్చు. ముగ్గురు ఉపముఖ్యమంత్రులు ఉన్నా, అంతా బాగానే సాగిపోతుంది అనుకున్న తరుణంలో జేడీఎస్ నేత శరణ గౌడ ఒక బాంబు పేల్చారు. యెడ్యూరప్ప ఇంకో 5 నెలలు మాత్రమే పదవిలో కొనసాగుతారని, ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలానంతరం యెడ్డీ రాజీనామా చేస్తారనే సంచలన ప్రకటన చేసారు. 

ప్రతిపక్షాలు ఇలాంటి ప్రకటనలు చేయడం సహజం కాబట్టి దీన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనిపించడంలో తప్పు లేదు. కానీ ఈ ఫిబ్రవరిలో జేడీఎస్  - కాంగ్రెస్ కూటమిని కూల్చేందుకు బేరసారాలు నెరిపినట్టుగా పేర్కొనబడే టేపులను బయటపెట్టింది ఈ శరణ గౌడానే. 

పోనీ, ఉన్న క్రేజ్ ను ఉయోగించుకొని మరింత మీడియా దృష్టి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేసాడు అనిపించొచ్చు. కానీ ప్రస్తుత కన్నడ రాజకీయాలను చూస్తుంటే ఈ విషయం కొట్టిపారేసేదిగా కనపడడం లేదు. యడ్యూరప్పను ముఖ్యమంత్రిని కానివ్వకుండా బి ఎల్ సంతోష్ ఎంత ప్రయత్నం చేసారో మనకందరికీ తెలిసిన విషయమే. 

యడ్యూరప్పను ముఖ్యమంత్రి చేయకపోతే బీజేపీ ప్రధాన మద్దతుదారులైన లింగాయత్ లు ఎక్కడ పార్టీకి దూరమైపోతారో అనే ఒక భయం ఉండేది. 2013లో  యెడ్డీ బీజేపీ నుంచి వేరుపడి సొంత పార్టీ పెట్టినప్పుడు బీజేపీ కేవలం 40 సీట్లకే పరిమితమయ్యింది. అంతలా బీజేపీ సీట్లు తగ్గడానికి ప్రధాన కారణం లింగాయత్ ఓటర్లంతా గంపగుత్తగా యెడ్యూరప్ప పార్టీకే తమ ఓట్లను వేసారు. 

ఇలాంటి పరిస్థితి మరోమారు ఎదురవకుండా ఉండేందుకు కేంద్ర నాయకత్వం జేడీఎస్ - కాంగ్రెస్ ల కూటమి పడిపోగానే యడ్యూరప్పను ముఖ్యమంత్రిని చేసింది. వెనువెంటనే ముగ్గురు ఉపముఖ్యమంత్రులను కూడా నియమించి కర్ణాటకలో నూతన తరం నాయకత్వాన్ని సృష్టించింది. వీరిలో లింగాయత్ సామాజికవర్గానికే చెందిన లక్ష్మణ్ సవాడి కూడా ఉన్నారు. ఇతన్ని ఇప్పుడు లింగాయత్ ల భావి నేతగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. 

జేడీఎస్ నేత శరణ గౌడ మాట్లాడుతూ ఇంకో విషయం కూడా చెప్పాడు. కీలకమైన బీజేపీ నేతలు తనకు ఫోన్ చేసి యెడ్డీ టేపుల కేసును తిరగతోడమని కోరుతున్నట్టు విస్తుపోయే విషయాన్నీ చెప్పాడు. దీన్నిబట్టి చూస్తుంటే అవినీతి అనే అంశం ముందుకు తీసుకువచ్చి యడ్యూరప్పను సాగనంపడానికి రాష్ట్ర బీజేపీ కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతుంది. వీరికి పైబడుతున్న యెడ్యూరప్ప వయసు కూడా కలిసొచ్చే అంశంగా మారింది. 

మొత్తంగా కర్ణాటక రాజకీయాలు ఇప్పుడప్పుడు మామూలు స్థితికి వచ్చేలా కనపడడం లేదు. కొన్ని సీట్లకు ఉపఎన్నికలు నిర్వహించాల్సి కూడా ఉంది. వీటన్నింటి నేపథ్యంలో కథలో నూతన ట్విస్టులతో ఈ సస్పెన్స్ డ్రామా కొనసాగబోతుందనేది మాత్రం తథ్యంగా కనపడుతుంది.