మహిళలపై దారుణాలు, అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ప్రేమించలేదని, నిరాకరించిందని రకరకాల కారణాలతో వావివరసలు కూడా మరిచిపోయి అమ్మాయిల్ని అన్యాయంగా, అతి దారుణంగా చంపేస్తున్నారు. ఇలాంటి దారుణమైన ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. 

కర్ణాటక, తుమకూరులో ఓ మేకల కాపరి ప్రేమించలేదని అమ్మాయిని దారుణంగా పొడిచి చంపాడు. ఈ దుండగుడిని శిర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెడితే.. దొడ్డగోళ గ్రామంలో కావ్య అనే అమ్మాయి పీయూసీ చదువుకుంటోంది. ఆమెను గత కొంత కాలంగా మేకల కాపరి ఈరణ్ణ ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. 

దీనికి కావ్య అడ్డు చెప్పింది. ప్రేమను నిరాకరించింది. ప్రేమించడం లేదని చెప్పడంతో ఈరన్న పగ పెంచుకున్నాడు. సోమవారం దొడ్డగోళ గ్రామంలోని ఇంటినుంచి శిరలో కాలేజీకి వెళుతున్న కావ్యను, ఈరన్న బైక్‌మీద వెంబడించి.. పక్కనే ఉన్న పొలంలోకి అమ్మాయిని ఎత్తుకెళ్లాడు. 

అక్కడ కత్తితో దారుణంగా ముఖం, గొంతు, చేతులపై పొడవడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. పోలీసులు గాలించి నిందితున్ని అరెస్ట్ చేసి బైకు, కత్తి, ఇతరత్రా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.