Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటకలో కాంగ్రెస్ నేత సిద్ధారామయ్య ఎమోషనల్ కామెంట్.. ‘ఇవే నా చివరి ఎన్నికలు’

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ సిద్దా రామయ్య ఎమోషనల్ కామెంట్ చేశారు. ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని వెల్లడించారు. రిటైర్‌మెంట్ తర్వాత కూడా రాజకీయాల్లో ఉంటారని వివరించారు. ప్రజల ఆశీర్వాదంతో తాను గతంలో పలుమార్లు రాష్ట్ర సీఎంగా చేశానని పేర్కొన్నారు.
 

karnataka opposition leader siddaramaiah emotional comment, this is my last elections
Author
First Published Feb 5, 2023, 1:01 PM IST

బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతున్నది. ఇప్పటికే సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం సిద్దారామయ్యల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. ఈ తరుణంలోనే మాజీ సీఎం సిద్ధారామయ్య ఎమోషనల్ కామెంట్ చేశారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని వెల్లడించారు. 

ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని మాజీ సీఎం సిద్దారామయ్య అన్నారు. అయితే, ఆ తర్వాత కూడా రాజకీయాల్లో ఉంటానని స్పష్టం చేశారు. కానీ, ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు. కర్ణాటక ప్రజలు తనను ఎంతో ఆదరించారని, వారి ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ఐదు సార్లు సీఎంగా చేశానని వివరించారు. ఎల్లప్పుడూ ప్రజల ప్రేమాభిమానాలు ఇలాగే ఉండాలని, తాను ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడతానని అన్నారు.

Also Read: 'ప్రధాని మోడీ ముందు.. సీఎం బొమ్మైతో సహా ఆ నేతలంతా కుక్కపిల్లలే.. నిలబడటానికి కూడా వణుకుతారు'

కర్ణాటక అసెంబ్లీ గడువు మే 24వ తేదీతో ముగియనుంది. కాబట్టి, మే నెలకు ముందే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 224 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతాయి. మే 2018లో చివరి  సారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఫలితాలు హంగ్ తేల్చడంతో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు జేడీఎస్ లీడర్ హెచ్ డీ కుమారస్వామి సీఎంగా చేశారు.

రాష్ట్రంలో ఐదు సార్లు సీఎంగా ఫుల్ టర్మ్‌లు చేసిన ఘనతే కేవలం సిద్దారామయ్యకే ఉన్నది. బీఎస్ యడియూరప్ప, కుమారస్వామిలు కూడా పలుమార్లు సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ పూర్తి కాలం ముఖ్యమంత్రిగా చేయలేకపోయారు. కానీ, సిద్దారామయ్య మాత్రం ఐదు సార్లూ సీఎంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఫుల్ టర్మ్ చేసి ప్రజల మన్ననలు పొందారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన తాజాగా ఎమోషనల్ కామెంట్ చేశారు.

సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యధికంగా రుణాలు తీసుకున్నందున రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టారని బసవరాజ్ బొమ్మై శనివారం ఆరోపించారు.  అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం దోపిడీ, లంచాలకు పాల్పడుతోందని రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios