బెంగళూరు : కర్ణాటక నూతన ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే కుమారస్వామి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నిలిపివేయాలంటూ అధికారులను ఆదేశించారు. 

గత కుమారస్వామి ప్రభుత్వం జూలై వరకు తీసుకున్న నిర్ణయాలను తక్షణమే నిలుపుదల చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై తాను లేదా సీఎస్ సమీక్షించిన తర్వాత వాటి అమలుపై ఆలోచన చేయాలని నిర్ణయించారు. 

అవసరమైతే కీలక ప్రాజెక్టుల్లో పున: సమీక్షిస్తానని కూడా స్పష్టం చేశారు. నూతన సీఎం ఆదేశాల ప్రకారం కుమారస్వామి ప్రభుత్వ నిర్ణయాలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు సీఎస్. ఇకపోతే యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఈనెల 31లోపు తన బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ప్రభుత్వం అమలు చేసిన నిర్ణయాలను నిలిపివేశారు. కీలక ప్రాజెక్టులపై పున: సమీక్షలు సైతం చేస్తున్నారు. దీంతో జగన్ లానే యడీయూరప్ప కూడా ఆలోచిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.