ఎల్లుండి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కంఠీరవ స్టేడియంలో ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య ఇద్దరిలో ఒకరు ముఖ్యమంత్రి కానున్నారు.
ఎల్లుండి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కంఠీరవ స్టేడియంలో ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే అదే రోజు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పుట్టినరోజు కావడం విశేషం. దీంతో డీకేకు కాంగ్రెస్ హైకమాండ్ ఏం గిఫ్ట్ ఇస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో తన బర్త్ డే రోజు సోనియాకు గిఫ్ట్ ప్రకటిస్తానని డీకే అన్నారు. అయితే శివకుమార్ పుట్టినరోజునే కాంగ్రెస్ సర్కార్ కొలువు దీరనుండటం విశేషం. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు హాజరవుతారని సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరూ ఊహించని విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తారుమారు చేస్తూ.. కింగ్ మేకర్ అవుదామనుకున్న జేడీఎస్‌కు షాకిస్తూ హస్తం పార్టీ విజయ దుందుభి మోగించింది. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో కాంగ్రెస్ 135 స్థానాల్లో ఆధిక్యంలో వుండగా.. బీజేపీ 65 స్థానాల్లో, జేడీఎస్ 20, ఇతరులు నాలుగు స్థానాల్లో ముందంజలో వున్నారు.
అంతాబాగానే వుంది కానీ.. ఇప్పుడు సీఎం ఎవరు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇది కాంగ్రెస్ అధిష్టానానికి అగ్నిపరీక్షే అని చెప్పవచ్చు. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య ఇద్దరిలో ఒకరు ముఖ్యమంత్రి కానున్నారు. ఆ ఒక్కరు ఎవరన్నది తేలాల్సింది వుంది. పార్టీలో గొడవలు వున్నప్పటికీ.. వీరిద్దరి కలిసి పనిచేశారు. అందుకే కాంగ్రెస్ ఈ స్థాయిలో విజయం సాధించగలిగింది.
అలాంటిది సీఎంగా ఒకరిని ఎంపిక చేస్తే.. రెండవ వారు తీవ్ర అసంతృప్తికి గురవుతారన్నది అందరికీ తెలిసిందే. దీనిని అదునుగా చేసుకుని బీజేపీ అధికారాన్ని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే. సీఎం ఎంపికపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. సీఎం ఎవరన్నది హైకమాండ్ నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు.
