బెంగళూరు: భార్య వివాహేతర సంబంధం గుట్టును రట్టు చేసిన ఓ వ్యక్తి దాని ఆధారంగా విడాకులు పొందాడు. కర్ణాటకలోని బళ్లారిలో ఈ ఘటన జరిగింది. తాజాగా విడాకులు పొందిన జంటకు 1991లో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా.  కొద్ది రోజులుగా భర్త భార్యను అనుమానిస్తూ వచ్చాడు.

తన అనుమానం నిజమా, కాదా అని తేల్చుకోవడానికి పక్కా ప్లాన్ వేశాడు. 2008లో రెండు రోజుల పాటు బెంగుళూర్ వెళ్తున్నానని చెప్పి భార్యకు తెలియకుండా పడకగదిలో డిజిటల్ వీడియో రికార్డర్ ను పెట్టి వెళ్లాడు. ఆ రెండు రోజుల పాటు భార్య తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని పడకగదిలో గడిపింది.

ప్రియుడితో భార్య రాసలీలలు డీవీడిలో రికార్డయ్యాయి. దాన్ని ఆధారం చేసుకుని భర్త విడాకులు కోరుతూ బళ్లారి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. వీడియోను సాక్ష్యంగా తీసుకుని కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే, భార్య విడాకులను వ్యతిరేకిస్తూ 2013లో హైకోర్టు తలుపు తట్టింది. 

తన భర్త పోర్న్ వీడియోలు తీస్తాడని, తనతో బలవంతంగా ఆ పని చేయించాడని కోర్టుకు తెలిపింది. ఆ వీడియో చూసిన న్యాయమూర్తులు.. భార్య మాటలు నమ్మే విధంగా లేవంటూ బళ్లారి ఫ్యామిలీ కోర్టు తీర్పును సమర్థించారు.