దేశంలో అఘాయిత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలు తీసుకువచ్చినా... పెద్దగా మార్పు ఏమీ ఉండటం లేదు. తాజాగా... ఓ మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. తన చెల్లికి జరిగిన అన్యాయంపై సదరు బాలిక సోదరుడు పగ తీర్చుకున్నాడు. నిందితుడిని కసి తీరా చంపేశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని ధార్వాడ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బసవేశ్వర్ నగర్ పట్టణానికి చెందిన పక్రుద్దీన్ నదాఫ్(53) శనివారం 11 ఏళ్ల మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించిన నదాఫ్‌ మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం మైనర్‌ బాలికను ఆమె ఇంటికి తీసుకొస్తుండగా కుటుంబ సభ్యులు గమనించి చితగ్గొట్టారు. 

ఆదివారం సాయంత్రం అతడిని నవాల్గండ్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు నిందితున్ని హుబ్బలిళోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే నదాఫ్‌పై ఆగ్రహం చల్లారని బాలిక సోదరుడు ఆదివారం మధ్యాహ్నం ఆస్పత్రికి వచ్చి నిందితుడిని కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటనతో కంగుతిన్న పోలీసులు బాలిక సోదరుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు.