కర్ణాటకలోని కంచుగల్‌ బందె మఠానికి చెందిన లింగాయత్‌ పీఠాధిపతి బసవలింగ స్వామి ఆత్మహత్య వెనక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పీఠాధిపతి బసవలింగ శ్రీ సోమవారం మఠంలోనే అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని కనిపించిన సంగతి తెలిసిందే. 

కర్ణాటకలోని కంచుగల్‌ బందె మఠానికి చెందిన లింగాయత్‌ పీఠాధిపతి బసవలింగ స్వామి ఆత్మహత్య వెనక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. మృతుడు హనీ ట్రాప్‌కు గురయ్యాడనే అనుమానం ఉందని, బ్లాక్‌మెయిల్‌ కారణంగా అతడు బలవంతంగా జీవితాన్ని ముగించుకున్నాడని పోలీసు వర్గాలు బుధవారం తెలిపాయి. ఈ కుట్ర వెనుక ఆ పదవిపై కన్నేసిన మరో లింగాయత్‌ సాహితీవేత్త హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్టుగా తెలుస్తోంది. 

రాజకీయ నాయకులతో సహా 10 నుంచి 15 మందితో కూడిన బృందం పీఠాధిపతి ఆత్మహత్య చేసుకునేలా ప్లాన్‌ను అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన మఠాధిపతిని ఒక ప్లాన్ ప్రకారం హనీ ట్రాప్ చేసి.. అతనికి చెందిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను విడుదల చేస్తానని బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్న కూడూరు పోలీసులు ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడు తన డెత్ నోట్‌లో చిత్రహింసలు, హనీ ట్రాపింగ్ గురించి ప్రస్తావించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసు దర్యాప్తు విషయంలో పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదని ఎస్పీ సంతోష్‌ బాబు స్పష్టం చేశారు. డెత్ నోట్‌లో మఠాధిపతి చాలా తక్కువ మంది పేర్లు ఉన్నప్పటికీ, అతని ఆత్మహత్యకు బాధ్యులెవరో ప్రత్యేకంగా ప్రస్తావించలేదని చెప్పారు. 

ఇక, మఠాధిపతి బసవలింగ స్వామి సోమవారం మఠంలోనే అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని కనిపించారు. మఠం ఆవరణలోని పూజా గృహంలోని కిటికీ గ్రిల్‌కు వేలాడుతూ కనిపించారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోవడానికి ముందు ఆయన రాసినట్టుగా చెబుతున్న డెత్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.