బెంగళూరు: కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ధర్మె గౌడ ఆత్మహత్య చేసుకున్నారు. రైలు కింద పడి ఆయన మరణించారు. చికమగళూరు సమీపంలో ఆయన మృతదేహం కనిపించింది. సంఘటనా స్తలంలో సూసైడ్ నోట్ లభించింది. 

సోమవారం సాయంత్రం ఆయన కనిపించుకుండా పోయారు. చివరకు ఆయన మృతదేహం చికమగళూర్ జిల్లా కడూరు తాలూకా గుణసాగర వద్ద రైల్వే ట్రాక్ మీద కనిపించింది. ఆయన వయస్సు 65 ఏళ్లు,. 

ఎస్ఎల్ ధర్మెగౌడ సోమవారం సాయంత్రం 7 గంటలకు తన ప్రైవేట్ కారు సాంత్రోలో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తన కారు డ్రైవర్ ను గానీ, బాడీ గార్డును గానీ తన వెంట తీసుకుని వెళ్లలేదు. రాత్రి 10 గంటలకు కూడా తిరిగి రాకపోవడంతో ఆయన కోసం గాలింపు చేపట్టారు. 

ఈ నెల 15వ తేదీన కర్ణాటక శాసన మండలిలో హైడ్రామా చోటు చేసుకుంది. ధర్మెగౌడను కాంగ్రెసు సభ్యులు సీటు నుంచి లాగేశారు. ధర్మె గౌడ జెడిఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గత రెండు రోజులుగా ఆయన శాసన మండలిలో చోటు చేసుకున్న సంఘటనలకు మనోవేదనకు గురైనట్లు చెబుతున్నారు. చైర్మన్ స్థానంలో కూర్చున్న తనను సీట్లోంచి లాగేయడంపై ఆయన మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు.