Karnataka: క‌ర్ణాట‌క‌ రాష్ట్రంలో భిక్షాటన నిషేధ చట్టాన్ని(Beggary Act) క‌ఠినంగా అమల్లోకి తీసుకురానున్నట్టు రాష్ట్ర‌ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కోట శ్రీనివాస పూజారి ప్రకటించారు. 

Karnataka: క‌ర్ణాట‌క రాష్ట్రంలో భిక్షాటన నిషేధ చట్టాన్ని(Beggary Act) క‌ఠినంగా అమల్లోకి తీసుకురానున్నట్టు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కోట శ్రీనివాస పూజారి ప్రకటించారు. బెంగళూరులోని ప‌లుప్రాంతాల్లో భిక్షాటన ప్రబలడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర, స్త్రీ శిశుసంక్షేమశాఖ మంత్రి హాలప్ప ఆచార్‌, కార్మికశాఖ మంత్రి శివరాం హెబ్బార్‌తో భిక్షాటన నిర్మూలన కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. క‌ర్నాట‌క‌లో భిక్షాటనకు స్వస్తి పలికేందుకు యాచక నిషేధ చట్టం-1975ను కఠినంగా అమలు చేస్తుందని త్రి కోట శ్రీనివాస్‌ పూజారి తెలిపారు.

స్థలాలను గుర్తింపు

బెంగళూరులో భిక్షాటన ఎక్కువగా ఉన్న 50 నుంచి 70 ప్రాంతాలను ప్ర‌భుత్వం గుర్తించింది. ఇటీవల భిక్షాటన చేస్తున్న 101 మంది పిల్లలను రక్షించి చైల్డ్ ప్రొటెక్షన్ డైరెక్టరేట్ పునరావాసం కల్పించింది. భిక్షాటన చేస్తున్న 720 మంది పిల్లలను గుర్తించినట్లు లీగల్ సర్వీసెస్ అథారిటీ నివేదిక సమర్పించిందని, అటువంటి ఇన్‌పుట్‌ల ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

బెంగుళూరులో భిక్షాటన నిషేధ చర్యలపై హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి హాలప్ప ఆచార్, కార్మిక శాఖ మంత్రి శివరాం హెబ్బార్, లీగల్ సర్వీసెస్ అథారిటీ, బృహత్ బెంగళూరు మహానగర సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. 

భిక్షాటన పేరుతో పలు అక్రమ కార్యకలాపాలను చేస్తున్న‌ట్టు సాంఘిక సంక్షేమ శాఖ గుర్తించిందని మంత్రి పూజారి తెలిపారు. ప్రత్యేకించి స్వార్థపరులు పిల్లల‌కు మత్తుమందు ఇచ్చి అక్ర‌మ ర‌వాణా చేస్తున్నార‌నీ, అలాగే వారిపై నిషేధిత మందులను ప్రయోగించడం ద్వారా భిక్షాటనలోకి నెట్టడం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు.

బెంగళూరులో భిక్షాటన విచ్చలవిడిగా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటి నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే బెంగళూరులోని భిక్షాటనపై పోలీసు శాఖలోని ఎనిమిది జోన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారని తెలిపారు. ఈ భిక్షాటన ఉబిలో నుంచి రక్షించబడిన పిల్లలను వారి తల్లులకు పునరావాసం కల్పించడానికి సాంఘిక సంక్షేమ శాఖ త్వరలో భవనాన్ని ఏర్పాటు చేస్తుందని, దీనికి నిధుల కొరత లేదని ఆయన వ్యాఖ్యానించారు.

మొబైల్ యాప్ e-gurutu

భిక్షాటనకు వెళ్లే పిల్లలను రక్షించేందుకు చైల్డ్ ప్రొటెక్షన్ డైరెక్టరేట్ e-gurutu పేరుతో మొబైల్ యాప్‌ను రూపొందించిందని, ఈ యాప్ లో భిక్షాటనకు వెళ్లే.. పిల్లల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే.. భిక్షాటన చేస్తున్న పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని 1098 నెంబ‌ర్ కు కాల్ చేయ‌డం ద్వారా కూడా స‌మాచారం అందించ‌వ‌చ్చ‌ని హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర వెల్లడించారు.