బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం పరమేశ్వర ఇంటిపై గురువారం నాడు ఉదయం ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించారు.

.గురువారం నాడు ఉదయం ఆరున్నర గంటలకు  ఐటీ అధికారుల సోదాలు ప్రారంభమయ్యాయి. నీలమంగలలోని మెడికల్  కాలేజీలో  కూడ సోదాలు నిర్వహించారు. 

ఈ కాలేజీ డిప్యూటీ సీఎం పరమేశ్వరకు చెందింది.  ఐటీ అధికారుల సోదాలను తాను పూర్తిగా సహకరిస్తున్నట్టుగా మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర ప్రకటించారు.
తాను దాచిపెట్టేందుకు ఏమీ లేదని పరమేశ్వర ప్రకటించారు.చట్ట వ్యతిరేకంగా తాను ఏమీ చేయలేదని పరమేశ్వర  మీడియాకు చెప్పారు.

ఇవాళ్టి నుండి కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల మొదటి రోజునే పరమేశ్వర ఇంటిపై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.

తన ఇంటితో పాటు తనకు చెందిన సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడాన్ని పరమేశ్వర స్వాగతించారు.  ఐటీ అధికారులకు తాను పూర్తిగా సహకరించినట్టుగా ఆయన తెలిపారు.

పరమేశ్వరకు చెందిన ముఖ్య అనుచరులు జలప్పతో పాటు ఇతరుల ఇళ్లపై కూడ ఐటీ అధికారులు ఏక కాలంలో  సోదాలు నిర్వహిస్తున్నారు. మరో వైపు గతంలోనే కర్ణాటక మాజీ మంత్రి డికె శివకుమార్ ఇంటిపై కూడ  ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులోనే ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రాజకీయంగా తనపై కక్షకట్టి జైల్లో పెట్టారని డికె శివకుమార్ ఆరోపించారు.