World Heritage List: ప్రపంచ వారసత్వ జాబితాకు కర్నాటకలోని బేలూర్, హళేబీడ్, సోమనాథపురలోని హోయసల దేవాలయాలను నామినేట్ చేసింది కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ.  

World Heritage List: ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన... ఐరాస విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) లేదా యూఎన్‌ ఎడ్యుకేషనల్‌ సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌( UNESCO) ప్రపంచ వారసత్వ కమిటీ ప్ర‌తి ఏటా.. ప్రపంచంలోని అనేక చారిత్రాత్మకంగా ప్రదేశాలను ఎంపిక చేస్తోంది. 2022-2023 సంవత్సరం నామినేష‌న్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ .. కర్నాటకలోని బేలూర్, హళేబీడ్, సోమనాథపురలోని హోయసల దేవాలయాలను కేంద్రం ప్రపంచ వారసత్వ జాబితాకు నామినేట్ చేసింది. 

ఈ మేర‌కు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టన విడుద‌ల చేసింది. భారత దేశానికి చెందిన యునెస్కో శాశ్వత ప్రతినిధి విశాల్ వి శర్మ.. హొయసల దేవాలయాల నామినేషన్‌ను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ డైరెక్టర్ లాజరే ఎలౌండౌకు అధికారికంగా సమర్పించారు. నామినేష‌న్ అనంత‌రం.. సాంకేతిక పరిశీలన నిర్వహించబడుతుంది. ఏప్రిల్ 15, 2014 నుండి 'హోయసల కాలం క‌ట్ట‌డాలు ' యునెస్కో యొక్క తాత్కాలిక జాబితాలో ఉన్నాయి. ఈ క‌ట్టాడాలు భార‌త‌దేశ చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి సాక్ష్యంగా నిలుస్తాయి. 

విశాల్ వి శర్మ మాట్లాడుతూ.. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాకు హోయసల క‌ట్ట‌డాలు నామినేట్ చేయడం భారతదేశానికి గర్వకారణం. ఈ దేవాల‌యాల్లో అసాధారణమైన శిల్ప కళాత్మకత గొప్ప‌ద‌నం మ‌హా అద్బుతం. ఆసియా కళాఖండాలలో వీటికి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. యూసెస్కో ప‌రిశీల‌న ఈ ఏడాది సెప్టెంబర్/అక్టోబర్‌లో జరుగుతుంది.

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హొయసల దేవాలయాలు ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడం భారతదేశానికి గొప్ప క్షణమని, గర్వ‌కార‌ణ‌మ‌ని అన్నారు. మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం 'వికాస్, 'విరాసత్' (హెరిటేజ్) రెండింటికీ కట్టుబడి ఉందని తెలిపారు. దేశ వారసత్వాన్ని కాపాడుకోవడంలో కేంద్రం కృషిచేస్తుంద‌ని అన్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని స్వదేశానికి తీసుకురావడంలో ప్రభుత్వం చేస్తున్న కృషి స్పష్టంగా తెలుస్తుందని అని మంత్రి తెలిపారు. క‌ర్ణాట‌క‌లోని హోయసల దేవాలయాలు పరిరక్షణ మరియు నిర్వహణను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చూసుకుంటుందని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

సోమనాథపుర దేవాలయం: మైసూరు నుంచి 38 కిలోమీటర్ల దూరంలో సోమనాథపుర దేవాలయం ఉంది. దీనిని చెన్నకేశవ, కేశవ ఆలయం అని కూడా అంటారు. హొయసల రాజు నరసింహ 3 వద్ద సైన్యాధిపతిగా ఉండే సోమనాథ దండనాయక 1258లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ వైష్ణవ హిందూ దేవాలయంలో శ్రీకృష్ణున్ని చెన్నకేశవునిగా కొలుస్తారు. హొయసల రాజుల కాలంలో నిర్మించిన 1500 ప్రాచీన ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయ నిర్మాణ సౌందర్యాన్ని, అందమైన పరిసరాలను వీక్షించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.