కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జి పరమేశ్వర హిందూ ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మం ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. పరమేశ్వర వ్యాఖ్యలు దుమారం రేపడంతో రాష్ట్ర బీజేపీ నేతలు భగ్గుమన్నారు.
కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జి పరమేశ్వర మంగళవారం తన నియోజకవర్గం కొరటగెరెలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్య చేశారు. హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉందని పరమేశ్వర అన్నారు. వివిధ మతాలు, వాటి నేపథ్యాల గురించి మాట్లాడుతూ, హిందూ ధర్మం ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. “ఈ ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. మరి హిందూ ధర్మం ఎప్పుడు పుట్టింది? ఎక్కడ పుట్టింది? అనేది ఇంకా సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిందని పరమేశ్వర వ్యాఖ్యానించారు. బౌద్ధం పుట్టింది ఈ దేశంలో, జైన మతం కూడా ఇక్కడే పుట్టింది.. ఇస్లాం, క్రైస్తవం బయటి నుండి వచ్చాయని హోంమంత్రి ప్రస్తావించారు.
పరమేశ్వర వ్యాఖ్యలు దుమారం రేపడంతో రాష్ట్ర బీజేపీ నేతలు భగ్గుమన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ కోట శ్రీనివాస్ పూజారి మాట్లాడుతూ.. హిందూ మతంపై హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు ఖండనీయమన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిపై దృష్టి పెట్టకుండా పరమేశ్వర అసహ్యకరమైన ప్రకటన చేశారని పూజారి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ మతానికి ఆధారం లేదని చెప్పడం నిజంగా అసమంజసమని, ఆయన నుంచి ఇలాంటి ప్రకటన వస్తుందని మేము ఊహించలేదన్నారు. ఇది కాంగ్రెస్ మైండ్‌సెట్‌ను తెలియజేస్తోందని , ఒక నిర్దిష్ట వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని పూజారి దుయ్యబట్టారు.
కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎన్.రవికుమార్ కూడా హోంమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన హిందూ సమాజాన్ని అపహాస్యం చేశారన్నారని ఫైర్ అయ్యారు. హిందూ మతం సముద్రం లాంటిదని, దానిని మరే ఇతర మతంతో పోల్చలేమన్నారు. హిందూ మతం అన్ని వర్గాల వారు గౌరవించే మతమని.. యుగాలుగా హిందూ మతాన్ని అనుసరిస్తున్నామని రవికుమార్ అన్నారు.
