Bajrang Dal activist Murdered: భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్యకు గురి కావడంతో శివమొగ్గ పట్టణం అట్టుడికిపోతోంది. భజరంగ్ కార్యకర్త హర్షా హత్య కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. ఈ కేసులో మొత్తం ఐదు మంది ఉన్నారని పోలీసు అధికారులు అంటున్నారని, మిగిలిన నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని హోమ్ మంత్రి తెలిపారు
Bajrang Dal activist Murdered: కర్ణాటక మరో వివాదంతో అట్టుడికిపోతోంది. షిమోగా జిల్లాలో హర్ష అనే భజరంగ్ దళ్ కార్యకర్తను అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ దారుణం వెలుగులో రావడంతో షిమోగా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతుడు హర్ష తన ఫేస్‌బుక్ లో హిజాబ్‌కు వ్యతిరేకంగా పోస్ట్ చేశాడనే నెపంతో ఈ హత్య జరిగినట్లు బజరంగ్ దళ్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో హిందూ, ముస్లీం వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గుంపును అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా..భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శివమొగ్గ నగరంలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
బజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు నిరసనగా సోమవారం సీగేహట్టిలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ తరుణంలో పలు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసులు బలగాలు మోహరించాయి. టియర్ గ్యాస్ ప్రదర్శించి.. నిరసనకారులను చెదరగొట్టారు. పలు చోట్ల నిషేధాజ్ఞాలు విధించారు. అయినప్పటికీ.. బజరంగ్ దళ్ మద్దతుదారులు హర్ష మృతదేహాంతో భారీగా ర్యాలీ తీస్తూ ఇంటికి తీసుకెళ్లారు. దీంతో కాసేపు అక్కడ టెన్షన్ నెలకొంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర సోమవారం (ఫిబ్రవరి 21) మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం శివమొగ్గలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయనీ, హింసాత్మక సంఘటనల దృష్ట్యా రాబోయే రోజులలో భారీ ఎత్తున పోలీసు అధికారుల బృందాలను మోహరించినట్లు తెలిపారు. భజరంగ్ కార్యకర్త హత్య కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామనీ, కర్ణాటక హోమ్ మంత్రి తెలిపారు. హర్షా హత్య కేసులో మొత్తం ఐదు మంది ఉన్నారని పోలీసు అధికారులు అంటున్నారని, మిగిలిన నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అరగ జ్ఞానేంద్ర చెప్పారు.
శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా.. బెంగళూరు నుంచి మరో 200 మంది పోలీసులను రప్పించామనీ, ఇప్పటికే 1200 మందికి పైగా పోలీసులు శివమొగ్గలో ఉన్నారని తెలిపారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, ఇతర జిల్లాల ఎస్పీలను కూడా ఆదేశించామని హోం మంత్రి చెప్పారు. పరిస్థితిని విశ్లేషించి, శాంతిభద్రతలను కాపాడాలని తాను పోలీసు యంత్రాగాన్ని ఆదేశించామనీ, 2-3 రోజులు జాగ్రత్త వహించాలని అన్నారాయన.
భజరంగ్ దళ్ కార్యకర్తపై అన్య మతస్తులు దాడి చేసి.. హత్య చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఖండించారు. ఈ హత్యలో మతపరమైన కోణం లేదని, ఈ సంఘటనపై విచారణ కొనసాగుతున్నదనీ, హిజాబ్ వివాదానికి ఈ హత్యకు సంబంధం లేదని స్పష్టం చేశారు. భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేయగా, మిగిలిన నిందితులను పట్టుకునేందుకు పోలీసు విచారణ కొనసాగుతోంది. భజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసు ఎన్ఐఏకి అప్పగించాలని కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ కి లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది.
శివమొగ్గలో గత రాత్రి 9 గంటల సమయంలో హర్ష(26) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. హర్ష భజరంగ దళ్ కార్యకర్త. హర్షపై గుర్తు తెలియని నలుగురు దుండగులు మారణాయుధాలతో విచక్షణ రహితంగా .. కొట్టి దాడి చేశారు. స్థానికులు గమనించడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన శివమొగ్గ నగరంలోని భారతి కాలనీలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. దొడ్డపేట పోలీస్‌స్టేషన్ సిబ్బంది, డీసీ, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న హర్ష్‌ను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.
