కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతున్న సమయలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశంలో అత్యాచారాలు పెరగడానికి హిజాబ్ ధరించకపోవడమే కారణమంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం (hijab row) తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఉద్రిక్తతలకు కారణమయ్యింది. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటికి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీన్నిబట్టే హిజాబ్ పై రేగిన వివాదం ఏ స్థాయిలో వుందో అర్థమవుతుంది. ఇలాంటి ఉద్రిక్తకర పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ (jameer ahmed) సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఇస్లాం సాంప్రదాయమైన హిజాబ్ మహిళల రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే జమీర్ పేర్కొన్నాడు. అమ్మాయిలు ఎక్కువగా హిజాజ్ ధరించకపోవడం వల్లే దేశంలో అత్యాచారాల రేటు కూడా ఎక్కువగా వుందని ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసారు.
''హిజాబ్ అంటూ ఇస్లాం పరిభాషలో తెర అని అర్థం. యవ్వనంలో అమ్మాయిల సౌందర్యాన్ని దాచివుంచేందుకు ఉపయోగించే తెరనే హిజాబ్. అమ్మాయిలు అందాన్ని ప్రదర్శించుకుండా హిజాబ్ ధరించడం వల్ల అనర్ధాలు జరక్కుండా వుంటాయి. హిజాబ్ ధరించిన వారే ఎక్కువగా అత్యాచారాలకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా అత్యాచారాల రేటు పెరగడానికి హిజాబ్ ధరించకుండా సౌందర్యాన్ని ప్రదర్శించడమే'' అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అభిప్రాయపడ్డాడు.
ఇస్లాం సాంప్రదాయంలో భాగమైన హిజాబ్ ఎన్నోఏళ్లుగా కొనసాగుతోందన్నారు. అయితే హిజాబ్ ధరించడం తప్పనిసరి ఏమీ కాదు... కానీ ఎవరయితే తమను తాము కాపాడుకోవాలని అనుకుంటారో వారు ఇది తప్పనిసరిగా ధరించాలని ఎమ్మెల్యే సూచించారు. అమ్మాయిలను హిజాబ్ రక్షిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ పేర్కొన్నారు.
కర్ణాటక (karnataka)లోని విద్యాసంస్థల్లో హిజాబ్ వివాదం ముదురుతుండటంతో ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇలా గత బుధవారం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా తిరిగి ఇవాళ్టి నుండి స్కూళ్లు ప్రారంభంకానున్నాయి. తొలి విడతలో 1 నుంచి 10వ తరగతి వరకు స్కూళ్లు మొదలవుతున్నాయి. ఈ క్రమంలోనే సమస్యాత్మక ప్రాంతాలు, విద్యాసంస్థల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో వుండనుంది. 12 నుంచి 19వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమలవుతాయని పోలీసులు, అధికారులు తెలిపారు. బడుల వద్ద గుంపులుగా ఉండరాదని, ధర్నాలు చేయరాదని ప్రకటించారు. హిజాబ్ తో ఓ వర్గం, కాషాయ కండువాలతో మరో వర్గం విద్యార్థులు విద్యాసంస్థలకు వస్తే అధికారులు ఎలా వ్యవహరిస్తారో ఇవాళ తేలనుంది. పాఠశాల పరిస్థితిని గమనించిన తర్వాత ఉన్నత విద్యాసంస్థల ఆరంభంపై నిర్ణయానికి వస్తామని సీఎం చెప్పారు.
ఇదిలావుంటే హిజాబ్ వివాదం దేశంలోని వివిధ రాష్ట్రాలకు పాకింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో హిజాబ్ కు అనుకూలంగా ఆందోళనలు సాగుతున్నాయి. అలాగే ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసితో పాటు ఇతర నాయకులు కూడా కర్ణాటకలో హిజాబ్ వివాదంపై స్పందించారు. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ వివాదంపై స్పందించారు. భారతదేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని, షరియత్ చట్టం ప్రకారం కాదన్నారు. ప్రతి విద్యాసంస్థకు తమ సొంత డ్రెస్ కోడ్ రూపొందించుకునే హక్కు ఉందని... రాజ్యాంగం ప్రకారమే వ్యవస్థ నడపాలని అన్నారు.
