Karnataka: బీజేవైఎం కార్యకర్త హత్యపై మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్ స్పందిస్తూ.. నిందితులను త్వరలో పట్టుకుంటామని, అవసరమైతే ఎన్‌కౌంటర్ కూడా నిర్వహించవచ్చని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.. 

Karnataka: కర్ణాటకలో భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్త హత్య తర్వాత.. రాష్ట్రంలో ఉద్రిక‌త్త ప‌రిస్థితి నెల‌కొంది. పలు చోట్ల మ‌త ఘ‌ర్ష‌ణ‌లు, హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చెలారేగాయి. దీంతో పలు పాంత్రాల్లో 144 సెక్షన్ విధించారు. అలాగే విద్యాసంస్థ‌ల‌కు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈ క్ర‌మంలో బీజేపీ కార్యకర్త హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అప్పగిస్తున్నట్లు శుక్ర‌వారం నాడు సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. మతోన్మాద శక్తులను అరికట్టేందుకు అవసరమైతే 'యోగి మోడల్'ను అవలంబించవచ్చని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

సీఎం బొమ్మై వ్యాఖ్య‌ల‌పై మాజీ సీఎం, జేడీ(ఎస్‌) నేత హెచ్‌డీ కుమార‌స్వామి కౌంట‌ర్ వేశారు. కర్ణాటకలో 'యోగి మోడ‌ల్ ' పనిచేయదని, రాష్ట్రాన్ని బీజేపీ భ్ర‌ష్టు ప‌ట్టిస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అదే సమయంలో.. కర్ణాటకకు వెయ్యి మంది మోడీలు వచ్చినా.. ఇక్క‌డ వారి మోడ‌ల్ వ‌ర్క‌వుట్ కాద‌ని కుమారస్వామి తేల్చి చెప్పారు

ఇదిలాఉంటే.. తాజాగా క‌ర్నాట‌క బీజేపీ మంత్రి విద్యాశాఖ మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. 'యోగి మోడల్' కంటే తాము ఐదడుగులు ముందు ఉన్నామని, అవసరమైతే.. ఎన్‌కౌంటర్ చేయడానికి ప్రభుత్వం వెనక్కి తగ్గదని అన్నారు. బీజేవైఎం కార్యకర్త హత్యపై మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్ స్పందిస్తూ.. నిందితులను త్వరలో పట్టుకుంటామని, అవసరమైతే ఎన్‌కౌంటర్ కూడా నిర్వహించవచ్చని తెలిపారు. 

అంతకుముందు సీఎం బసవరాజ్ బొమ్మై విలేకరులతో మాట్లాడుతూ.. బీజేవైఎం కార్యకర్త హత్య కేసు దర్యాప్తును NIAకి అప్పగించాలని మేము నిర్ణయించుకున్నామనీ, ఈ విషయమై హోం శాఖకు సమాచారం అందించామ‌ని తెలిపారు. ఇది అంతర్ రాష్ట్ర (కర్ణాటక-కేరళ) వ్యవహారం కాబట్టి.. కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకి అప్పగించాలని నిర్ణయించామ‌ని తెలిపారు. 

ఇద్దరు నిందితుల అరెస్టు

బళ్లారి చెందిన‌ భారతీయ జనతా పార్టీ (బిజెపి) యువమోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారు మంగళవారం రాత్రి తన దుకాణం మూసివేసి.. ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న‌పై ముగ్గురు గుర్తుతెలియని దుండగులు దాడి చేసి..హత్య చేశారు. ఈ హత్య కేసులో దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులను కర్ణాటక పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

నిందితుల‌కు పీఎఫ్‌ఐతో సంబంధాలు! 

ఇద్దరికీ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. అరెస్టయిన నిందితులను జిల్లాలోని సులియా తాలూకా బెల్లారేకు చెందిన జాకీర్ (29), మహ్మద్ షఫీక్ (27)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 

అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. “నిందితులు ఇద్దరూ బెల్లారేకి చెందినవారు, వారికి PFI తో అనుమానాస్పద సంబంధాలు ఉన్నాయి, వాటిని మేము విచారిస్తున్నాము. వారిని గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకుని.. విచారణ అనంతరం అరెస్ట్ చేశాం. వారిని కోర్టు ముందు హాజరుపరిచి, పోలీసు కస్టడీకి కోరడంతో పాటు తదుపరి విచారణ జరుపుతాం. అని తెలిపారు.

'అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నాం'

దక్షిణ కన్నడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ హృషికేష్ భగవాన్ సోనావానే మీడియాతో మాట్లాడుతూ.. నిందితుల‌కు ఉగ్ర‌ సంస్థలతో ఉన్న సంబంధాలపై విచారణ జరిపి.. ధృవీకరించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం మేము అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని, ఇతరుల ప్రమేయం, ఉద్దేశ్యం, ఇతర కేసులను పరిశీలిస్తామని సోనావానే తెలిపారు. జకీర్‌పై 2020లో బెల్లారే పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 324 కింద ఇప్పటికే కేసు నమోదైందని ఆయన చెప్పారు.