బ్రిటన్ లో కరోనా స్ట్రెయిన్ వణికిస్తోన్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రం నుంచి వెయ్యిమంది నిపుణులైన నర్సులను బ్రిటన్ కు పంపాలని నిర్ణయించింది. 

ఐరోపాలోని పలు దేశాల్లో భారతీయ నర్సులకు భారీ డిమాండ్ ఉందని, దీంతో భారతీయ నర్సులకు ఉపాధి కల్పించడానికి పలు ఆసుపత్రులు ముందుకు వచ్చాయని కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వవత నారాయణ తెలిపారు.

దీంతో మొదటివిడతగా కర్ణాటక ఒకేషనల్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్ మెంటు కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి 1000మంది నర్సులను బ్రిటన్ పంపించనున్నట్లు డిప్యూటీ సీఎం నారాయణ చెప్పారు.

ఉద్యోగం పొందిన భారతీయ నర్సులకు వార్షికవేతనం రూ.20లక్షలు ఇండియన్ కరెన్సీని ఇస్తుందని మంత్రి చెప్పారు. ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి శాఖ, నేషనల్ హెల్త్ సర్వీసెస్ (ఎన్హెచ్ఎస్),హెల్త్ ఎడ్యుకేషన్ ఇంగ్లాండ్ (హెచ్ఇఇ) ల మధ్య ఒప్పందం కుదిరిందని డిప్యూటీ సీఎం చెప్పారు.

విదేశాల్లో ఉపాధి కల్పనకు కర్ణాటక సర్కారు అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కెనడాల ఐటీ, వీడియో గేమింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు నిపుణులకు ఉపాధి కల్పించేందుకు కర్ణాటక సంస్థ ఆ దేశంతో సంప్రదింపులు సాగిస్తోంది.