అర్చకులను వివాహమాడే వధువులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆలయాల్లో అర్చకత్వం చేసే బ్రాహ్మణ యువకులను వివాహమాడితే రూ.3 లక్షల బాండ్‌ను ప్రోత్సాహక బహుమతిగా అందచేయనుంది. అర్చకులు, పురోహితులను పెళ్లి చేసుకోవడానికి  యువతులు వెనుకాడుతున్నందున  ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని అక్కడి ప్రభుత్వం రూపొందించింది. 

 ‘మైత్రి’ పేరిట ఏర్పాటైన ఈ పథకాన్ని బుధవారం ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రారంభించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర బ్రాహ్మణ అభివృద్ధి బోర్డు చైర్మన్‌ ఎస్‌హెచ్‌ సచ్చిదానంద మంగళవారం బెంగళూరు లో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మరెక్కడా ఇలాంటి పథకం లేదని అన్నారు. 

ఈ ప్రోత్సాహక బాండ్‌ను మూడేళ్ల తర్వాత నగదుగా మార్చుకోవచ్చునని చెప్పారు. అదేవిధంగా నిరుపేద బ్రాహ్మణ యువతులను వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చే పురోహితులు, అర్చకులకు రూ.25 వేల ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. దీంతో పాటు ఒక ఎకరాలోపు పొలం ఉన్నవారికి బోరుబావి తవ్వించేందుకు, ట్రాక్టర్‌ కొనుగోలుకు, పాడి పరిశ్రమకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. 

పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు పొందే బ్రాహ్మణ విద్యార్థులకు జిల్లాకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి విశ్వామిత్ర ప్రతిభా పురస్కారాలను అందిస్తామని తెలిపారు. రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు నగదు పురస్కారం అందజేస్తామన్నారు.