కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ఎన్నికల రాజకీయాలకు రాజీనామా చేశారు. ఇక పై ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాను పోటీ చేయను అని వివరించారు. అయితే, పార్టీని మరింత పటిష్టపరిచేందుకు సమయం వెచ్చిస్తానని, పర్యటనలు చేస్తానని తెలిపారు.
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం,బీజేపీ దిగ్గజ నేత బీఎస్ యడియూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ఇక పై ఆయన ఎలక్షన్‌లలో పోటీ చేయబోనని నిర్ణయించుకున్నారు. ఎన్నికల రాజకీయాలకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ పార్టీని బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తానని వివరించారు. కర్ణాటకలో పర్యటిస్తూ పార్టీని బలపర్చడానికి శాయశక్తుల పని చేస్తానని తెలిపారు.
బెళగావిలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. ‘ఎన్నికల్లో నేను పోటీ చేసే అవకాశాలు లేవు. ఎమ్మెల్యే, సీఎం పోస్టులకు నేను ఇప్పటికే రాజీనామా చేశాను. నేను ఇప్పుడు 80వ పడిలోకి వెళ్లుతున్నాను. పర్యటనలు చేస్తూ పార్టీని బలోపేతం చేస్తాను. పటిష్ట నిర్మాణం చేపడుతాను. రాష్ట్రంలో మళ్లీ బీజేపీని అధికారంలోకి తేవడానికి చేయాల్సినదంతా చేస్తాను’ అని వివరించారు.
Also Read: భార్యను చంపి బంగ్లాదేశ్ పారిపోయే ప్రయత్నం.. విమానంలో రెండు టికెట్లు బుక్ చేసి.. చివరికి...
2021 జులైలో బీఎస్ యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాతే ప్రస్తుత సీఎం బసవరాజు బొమ్మై సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. షికారిపురలో పురసభ అధ్యక్షుడిగా యెడియూరప్ప రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1983లో తొలిసారి షికారిపుర నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి అదే ఏరియాలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా విజయ ఢంకా మోగించారు.
