నిన్నటి వరకు కాంగ్రెస్-జేడీస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా వున్న కర్ణాటక సంక్షోభం ఇవాళ కాంగ్రెస్ వర్సెస్ జేడీఎస్‌గా మారిపోయింది. రెండో రోజు సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ సురేశ్ కుమార్ అవిశ్వాసం చర్చకు అనుమతినిచ్చారు.

దీనిపై సీఎం కుమారస్వామి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందంటూ కుమారస్వామి మండిపడ్డారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్.. ఐదారు కోట్లు ఆఫర్ చేస్తుంటే ఎలా కాపాడుకోగలమని ప్రశ్నించింది.

మరోవైపు రెబల్ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత సంపాదించినా జానెడు పొట్టకోసమేనని.. అందుకోసం దిగజారుడు రాజకీయాలు చేస్తారా అని సురేశ్ కుమార్ సభ్యులను ప్రశ్నించారు.

సభలో రెండు వర్గాలకు నైతిక విలువలు లేవని స్పీకర్ మండిపడ్డారు. గొప్ప గొప్ప వాళ్లు ఈ సభలో కూర్చొన్నారని... కానీ ఇప్పుడు దరిద్రపు రాజకీయాలు నడుస్తున్నాయని, ఎమ్మెల్యేల తీరును చూసి కర్ణాటక ప్రజలు అసహ్యించుకుంటున్నారని స్పీకర్ తెలిపారు.  

మరోవైపు స్పీకర్ తీరుపై బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బలపరీక్షను కావాలనే ఆలస్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బలపరీక్షను గురువారమే నిర్వహించాలంటూ గవర్నర్.. స్పీకర్‌కు పంపిన లేఖపై ముఖ్యమంత్రి కుమారస్వామి సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.